111జీవో రద్దు?

ABN , First Publish Date - 2021-06-23T09:46:36+05:30 IST

జంట జలాశయాల సంరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవోకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడనుంది.

111జీవో రద్దు?

  • ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు
  • ఇటీవల కేబినెట్‌ భేటీలో చర్చ
  • న్యాయపరమైన చిక్కులపై ఆరా
  • పరిధి కుదించాలంటున్న అధికారులు
  • ఎత్తేసేందుకే ప్రభుత్వం మొగ్గు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జంట జలాశయాల సంరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవోకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడనుంది. 111 జీవోను తొలగించడానికి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ సైతం 111 జీవోను ఎత్తేస్తామని మూడేళ్ల క్రితం ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటించారు. తాజాగా ప్రభుత్వ ఆదాయ కసరత్తులో భాగంగా 111 జీవో ఎత్తివేతపై సమాలోచన  చేస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించిన్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు పశ్చిమాన పలు ప్రాంతాల్లో రియాల్టీ అభివృద్ధికి అవరోధంగా మారిన 111 జీవోను తొలగిస్తే ప్రభుత్వ రాబడి మరింత పెరుగుతుందని, ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలకు ప్రకటించిన విధం గా హామీని నెరవేర్చిన్నట్లు అవుతుందని కేబినెట్‌లో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. 111 జీవో ఎత్తివేస్తే ఎదురయ్యే పర్యావరణ, న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. రాష్ట్ర ఆదాయంపై చర్చ జరిగినపుడు హైదరాబాద్‌కు పశ్చిమాన భూముల క్రయ, విక్రయాలపై 111 జీవో ప్రభావం చూపుతోంద ని, వేల ఎకరాల భూముల అభివృద్ధి నిలిచిపోయిందని ప్రస్తావించిన్నట్లు తెలిసింది. 111 జీవో పరిధిలోని గ్రా మాల ప్రజలు సైతం తమ భూములకు సరైన విలువ లేదని, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులపై ఆంక్షలు ఉండడంతో కొనుగోలు చేసేందుకు డెవలపర్లు, రియల్టర్లు ఆసక్తి చూపడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం ప్రస్తావనకు  వచ్చింది. ఆ జీవోను ఎత్తేస్తే 84 గ్రామాల పరిధిలో పెద్దఎత్తున భూముల విక్రయాలు జరగడంతో పాటు పలు గృహనిర్మాణ ప్రాజెక్టులు వస్తాయని, రిజిస్ట్రేషన్‌, ఇతర డెవల్‌పమెంట్‌ చార్జీల రూపంలో భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేసిన్నట్లు తెలుస్తోంది.  


జంట జలాశయాల సంరక్షణకే

జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిరక్షణలో భాగంగా వాటి పూర్తి నిల్వ(ఎ్‌ఫటీఎల్‌) ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ 1996 మార్చి 8న జీవో నెంబర్‌ 111ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సివరేజీ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎ్‌సఎస్‌) చేసిన సూచనల మేరకు ఈ జీవో తెచ్చారు. జంట జలాశయాల ఎగువన 84 గ్రామాల్లోని వ్యవసాయ భూము ల్లో ఎలాంటి భవన నిర్మాణాలు, లేఅవుట్లను ఏర్పాటు చేయకూడదని ఈ జీవో నిర్దేశిస్తోంది.  జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, చెక్‌ డ్యామ్‌లు, లిఫ్టు ఇరిగేషన్‌ పనులు కూడా చేపట్టకూడదు. ఎలాంటి నిర్మాణాలు రాకుండా చూడాల్సిన బాధ్యత హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థలదీ. అదేవిధంగా ఉస్మాన్‌సాగర్‌ నుంచి అసి్‌ఫనగర్‌ వరకు గల వరదనీటి కాలువ వెంట వందఫీట్ల వరకు ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదని జీఓను తీసుకొచ్చారు.


అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

అయితే, 84 గ్రామాల పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వచ్చాయి. హైదరాబాద్‌కు పశ్చిమాన ఉన్న ఈ గ్రామాల సమీపంలోనే ఐటీ కారిడార్‌ ఉండడంతో ఆయా గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడి అక్రమంగా, అనధికారికంగా లేఅవుట్లు, భవనాలు వచ్చేశాయి. అనేక సంస్థలు భూములను కొనుగోలు చేసి భారీ ప్రహరీలను సైతం నిర్మించుకున్నాయి. ఆరేళ్ల క్రితం 111 జీవో పరిధిలో వచ్చిన అక్రమ నిర్మాణాలపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు సమగ్ర సర్వే చేశారు. 111 జీఓ పరిధిలోని 84 గ్రామాల్లో వేల ఎకరాల్లో 418 లేఅవుట్లను వేస్తే, అందులో 6,682 అక్రమ నిర్మాణాలు చేసిన్నట్లు గుర్తించారు. వ్యక్తిగతంగా మరో 5,202 గృహాలు, ఇతర నిర్మాణాలు మొత్తంగా 11,887 అక్రమ నిర్మాణాలు ఆరేళ్ల క్రితమే వచ్చాయి. పలు ప్రాంతాల్లో నీటి ప్రవా హం సాగకుండా గోడలు లేచాయి. సినీ, రాజకీయ ప్ర ముఖులు ఫామ్‌హౌ్‌సలను సైతం నిర్మించుకున్నారు.


జీఓ ఎత్తివేయడమా? కుదించడమా?

జీఓను ఉన్న పళంగా ఎత్తివేస్తే పర్యావరణ వేత్తల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలపై, ప్రభుత్వం చర్య లు తీసుకోకపోవడంపై పలు సంస్థలు కూడా కోర్టుకెక్కాయి. ఈ పరిస్థితుల్లో 111 జీవోను ఎత్తేస్తే మరిన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. ఇప్పటికే వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వచ్చిన నేపథ్యంలో జీవోను ఎత్తివేయకుం డా పరిధిని కుదిస్తే ఇబ్బందులుండవని వారు సూచించినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం పూర్తిగా జీవో ఎత్తివేతకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 


స్థానికుల అభ్యంతరాలు

జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలు పెరిగి, పరిశ్రమలు వెలిస్తే వాటి అస్తిత్వం దెబ్బతినే ప్రమాదముందని 25 ఏళ్ల క్రితం కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తగుచర్యలు చేపట్టాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగానే 111 జీవో వచ్చింది. ఈ జీఓ ఉల్లంఘనలను పర్యావరణ వేత్తలు హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌జీటీ ఆదేశం మేరకు ఎస్‌పీ సింగ్‌, దానకిషోర్‌, ఎస్‌కే జోషిలతో కూడిన కమిటీ పరిస్థితిని అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదికను అందించింది. జంట జలాశయాలకు ఎగువన పది కిలోమీటర్ల పరిధిలో భూములపై పరిమితులు విధించడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నివేదించింది. తమ భూములకు ఆశించిన ధర రాకపోవడంతో జీఓను తొలగించాలని 84 గ్రామాల ప్రజలు పట్టుబడుతున్నారు.  


‘అవసరం లేకపోయినా అనేక గ్రామాల్లో 111 జీవో అమలవుతున్నది. వచ్చే ఆరు నెలల్లో ఆ జీవోను ఎత్తేస్తా. పోయినసారే చేద్దామనుకున్నా. కానీ, ఈ జీఓను ఎత్తేసి కేసీఆర్‌, యాదయ్య కలిసి వంద కోట్లు తిన్నరంటరు.. బద్నాం ఎందుకని చేయలే. కానీ, ప్రామీస్‌ చేస్తున్న.. మీకు శాపమైన 111 జీవోను ఆరు నెలల్లో ఎత్తేస్తా. మీ బిడ్డగా చెప్తున్న. ఎవరూ భూములు అమ్ముకోవద్దు. ఇక్కడా ఐటీ, ఇతర పొల్యుషన్‌ లేని పరిశ్రమలు రావాలే’ 

  1. - 2018 మార్చి 11న చేవేళ్ల నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు. 

Updated Date - 2021-06-23T09:46:36+05:30 IST