111 కేజీల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-25T05:25:44+05:30 IST

సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి రవాణాకు పాల్పడుతున్న వారు ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా గంజాయిని తరలిస్తున్నారు. జిల్లాలో గంజాయి రవాణాపై దృష్టి సారించిన సెబ్‌ అధికారులు ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుంటున్నారు. ఇదే తరహాలో శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సెబ్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ వాహన తనిఖీలు చేపట్టి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది.

111 కేజీల గంజాయి స్వాధీనం
వివరాలు తెలుపుతున్న జేడీ శ్రీలక్ష్మి, చిత్రంలో నిందితులు

ఐదుగురు మహిళల అరెస్ట్‌


నెల్లూరు(క్రైం), జూలై 24: సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి రవాణాకు పాల్పడుతున్న వారు ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా గంజాయిని తరలిస్తున్నారు. జిల్లాలో గంజాయి రవాణాపై దృష్టి సారించిన సెబ్‌ అధికారులు ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుంటున్నారు. ఇదే తరహాలో శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సెబ్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ వాహన తనిఖీలు చేపట్టి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలను నెల్లూరు-1వ సెబ్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేడీ శ్రీలక్ష్మి వివరించారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో ఐదుగురు మహిళలు, నలుగురు వ్యక్తుల నుంచి 111 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా తమిళనాడు తిరువన్నామలైకు చెందిన కదిరి వేలు, రోజా, కామాక్షి, మత్తు, నాగరాజుతోపాటు అనంతపురం జిల్లా కొక్కంటి క్రాస్‌ రోడ్డుకు చెందిన విజయ్‌ గంజాయి రవాణా చేస్తున్నట్లు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 78.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.35 వేలకు ఆ గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారు. ఇదేవిధంగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండులోని పార్శిల్‌ సర్వీస్‌ వద్ద ఆగిన విజయవాడ - నెల్లూరు బస్సులోనూ సెబ్‌ అధికారులు తనిఖీలు చేశారు.  తమిళనాడు ప్రాంతానికి చెందిన మనిముత్తును అదుపులోకి తీసుకుని అతని నుంచి 8.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. 


బూదనం టోల్‌ప్లాజా వద్ద...

బూదనం టోల్‌ప్లాజా వద్ద సెబ్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో కాకినాడ నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కాకినాడకు చెందిన మారెడ్డి శ్రీను, ఆగరపు రాజకుమారి, రాణి, రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-07-25T05:25:44+05:30 IST