వీసెజ్‌ ఎగుమతుల్లో 11.45% వృద్ధి

ABN , First Publish Date - 2020-10-18T06:46:37+05:30 IST

కొవిడ్‌ సమయంలో భారీగా ఎగుమతులు చేసి విశాఖ ఆర్థిక మండలి (వీసెజ్‌) నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ ఎ

వీసెజ్‌ ఎగుమతుల్లో 11.45% వృద్ధి

ప్రథమార్ధం ఎగుమతులు రూ.52,808 కోట్లు..

‘ఆంధ్రజ్యోతి’తో డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ 


విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ సమయంలో భారీగా ఎగుమతులు చేసి విశాఖ ఆర్థిక మండలి (వీసెజ్‌) నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ ఎ.రామమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో  రూ.52,808 కోట్ల ఎగుమతులు చేశామన్నారు.


గత ఏడాది (2019-20) ఇదే కాలానికి రూ.47 వేల కోట్ల ఎగుమతులు జరిగాయన్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొవిడ్‌ కారణంగా అనేక పరిశ్రమలు మూతపడి పలు సెజ్‌ల ఎగుమతులు తగ్గినా వీసెజ్‌ మాత్రం  11.45 శాతం వృద్ధి రేటు సాధించిందని వివరించారు. ఉత్పత్తి రంగం ఎగుమతుల వృద్ధి 21.5 శాతమని చెప్పారు.


ఐటీ రంగం రూ.35,491 కోట్లు, ఫార్మా రూ.10,369 కోట్లు, సర్వీస్‌ యూనిట్లు రూ.2,048 కోట్లు, మెటల్స్‌, మినరల్స్‌ రూ.1,681 కోట్లు, ఆహార, వ్యవసాయోత్పత్తులు రూ.1,285 కోట్ల ఎగుమతులు చేశాయన్నారు. 


కొత్తగా 13 యూనిట్లు

కొవిడ్‌ సమయంలో వీసెజ్‌లో మాత్రం 13 యూనిట్లు కొత్తగా వచ్చాయని చెప్పారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారన్నారు. వీఎ్‌సఈజెడ్‌ పరిధిలో మొత్తం పరిశ్రమలు 509 కాగా, అందులో ఐటీ పరిశ్రమలే 372 ఉన్నాయని, వాటిలో తెలంగాణాలో 322, ఏపీలో 50 ఉన్నాయని చెప్పారు.

దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని సోలార్‌ ప్యానల్స్‌ తయారీ పరిశ్రమ తెలంగాణా ఫ్యాబ్‌సిటీలో కొత్తగా వచ్చిందని చెప్పారు. 


Updated Date - 2020-10-18T06:46:37+05:30 IST