విదేశాల్లో 11,616 మంది భారతీయులకు కరోనా: మంత్రి మురళీధరన్

ABN , First Publish Date - 2020-09-18T16:24:24+05:30 IST

విదేశాల్లో మహమ్మారి కరోనా బారిన పడ్డ భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

విదేశాల్లో 11,616 మంది భారతీయులకు కరోనా: మంత్రి మురళీధరన్

న్యూఢిల్లీ: విదేశాల్లో మహమ్మారి కరోనా బారిన పడ్డ భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా గురువారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. భారత మిషన్ సమాచారం మేరకు సెప్టెంబర్ 10వ తేదీ వరకు వివిధ దేశాల్లో 11,616 మంది భారత ప్రవాసులు కొవిడ్ బారిన పడ్డారని మంత్రి వెల్లడించారు. అత్యాధికంగా సింగపూర్‌లో 4618 మంది భారతీయులకు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత బహ్రెయిన్‌లో 2,639 మంది, కువైట్‌లో 1,769 మంది, ఒమన్‌లో 907 మంది, ఖతార్‌లో 420 మంది, ఇరాన్‌లో 308, యూఏఈలో 238 మంది, ఇటలీలో 192 మంది కరోనా బారిన పడ్డారని మంత్రి తెలిపారు.   


ఇక కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు మెడిసిన్స్, వైద్య పరికరాలు పంపించి కష్టకాలంలో ఆదుకుందని మంత్రి పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా మే 7న ప్రారంభించిన 'వందే భారత్ మిషన్‌'లో భాగంగా వాయువు, రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా ఇప్పటివరకు సుమారు 14,12,835 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు మురళీధరన్ వెల్లడించారు. అలాగే మరో 4,80,738 మంది ప్రవాసులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయా దేశాల ఎంబసీల్లో తమ పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాక భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నుండి దాదాపు రూ.22.5 కోట్ల వ్యయంతో ఆర్థిక, ఇతర సమస్యలతో బాధపడుతున్న 62,000 మంది భారతీయ పౌరులకు మా మిషన్లు సహాయం చేశయని మంత్రి తెలియజేశారు.    


కాగా, 'వందే భారత్ మిషన్‌'లో భాగంగా ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్నవారిలో 56,630 మంది విద్యార్థులు, 3,08,099 వర్కర్స్ ఉన్నట్లు వెల్లడించారు. అలాగే స్వదేశానికి చేరుకున్న వర్కర్స్ కోసం స్వదేశ్(స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దీని ద్వారా వర్కర్ల నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కల్పించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఇక గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను స్వదేశానికి తరలించడంలో జాప్యం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానంగా... గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడంలో ఎలాంటి ఆలస్యం జరగడం లేదని స్పష్టం చేశారు. అక్కడి నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు షెడ్యూల్ చేయబడిన విమానాల ద్వారా ప్రవాసులను తరలిస్తున్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-09-18T16:24:24+05:30 IST