Abn logo
Apr 9 2021 @ 18:13PM

భారత్-చైనా మిలిటరీ చర్చలు ప్రారంభం

న్యూఢిల్లీ : భారత్-చైనా మిలిటరీ కమాండర్ల 11వ విడత చర్చలు శుక్రవారం చుసుల్‌లో ప్రారంభమయ్యాయి. లడఖ్‌లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ ప్లెయిన్స్‌లోని ఫ్రిక్షన్ పాయింట్ల వెంబడి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. భారత సైన్యానికి చెందిన లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. 


పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షణ తీరాల నుంచి ఇరు దేశాలు తమ దళాలను ఫిబ్రవరిలో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్-చైనా మధ్య చాలా ముఖ్యమైన పరిణామం జరిగిందని చెప్పారు. ఇరు పక్షాలు అంగీకరించిన మేరకు పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు. 


11వ విడత చర్చలు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత భూభాగంలోని చుసుల్ బోర్డర్ పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. మిగిలిన ఘర్షణ ప్రాంతాల నుంచి కూడా ఇరు దేశాల సైన్యాలను త్వరగా ఉపసంహరించాలని భారత్ పట్టుబడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలకు దళాల ఉపసంహరణ పరిపూర్ణంగా జరగడం తప్పనిసరి అని స్పష్టం చేయనున్నట్లు తెలిపాయి.


ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం గత ఏడాది మే నెల నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.