ఒకే రోజు 12 కేసులు

ABN , First Publish Date - 2020-05-28T11:05:56+05:30 IST

జిల్లాను కరోనా వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండగా, బుధవారం ఒక్కరోజే 12

ఒకే రోజు 12 కేసులు

అంతా ముంబాయి నుంచి వచ్చిన వలస కార్మికులే

అప్రమత్తమైన అధికారులు

ఇప్పటి వరకు 54 మందికి సోకిన వైరస్‌ 


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాను కరోనా వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండగా, బుధవారం ఒక్కరోజే 12 మందికి వైరస్‌ సోకింది. వీరంతా ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వలస కార్మికులపై మరింత నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 54 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో ముంబాయి నుంచి వచ్చినవారు 50 మంది ఉన్నారు. 


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో మల్యాల మండలానికి చెందినవారు ఆరుగురు, మేడిపల్లి మండలానికి చెందిన ముగ్గురు, కోరుట్ల, కథలాపూర్‌, గొల్లపల్లి మండలానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మల్యాల మండలం లంబాడిపెల్లికి చెందిన 13 మంది బస్సులో ఈ నెల 17న ముంబై నుంచి స్వగ్రామానికి వచ్చారు. ఇందులో ఓ వ్యక్తికి వ్యాధి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ రాగా, ఆయన వెంట వచ్చిన వారందరికీ పరీక్షలు చేశారు. బుధవారం 47 సంవత్సరాల వ్యక్తికి, 45 సంవత్సరాల మరో వ్యక్తికి, 20 సంవత్సరాల యువకునికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే సర్వాపూర్‌ గ్రామానికి ముంబాయి నుంచి 8 మంది ఈ నెల 20న వచ్చారు. ఇందులో ఇద్దరు ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందినవారు, వారు ఓ రోజు సర్వాపూర్‌లోనే ఉండి కాగజ్‌నగర్‌కు వెళ్లారు. అయితే కాగజ్‌నగర్‌కు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ రాగా అధికారులు అప్రమత్తమై సర్వాపూర్‌లో ఉంటున్న ఆరుగురికి పరీక్షలు చేశారు. దీంతో సర్వాపూర్‌కు చెందిన 37 సంవత్సరాల మహిళతో పాటు 16 సంవత్సరాల వయస్సు గల ఆమె కూతురికి, ఆమె వెంట వచ్చిన 39 సంవత్సరాలు గల మరో మహిళకు పాజిటివ్‌ వచ్చింది. మరో ముగ్గురికి నెగెటివ్‌ అని తేలింది.


దీంతో ఇప్పుడు మల్యాల మండల ప్రజలు కరోనాతో భయపడిపోతున్నారు. మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 25న ఐదుగురు ముంబాయి నుంచి వచ్చారు. గ్రామస్థులు ఊరిలోకి రానివ్వకపోవడంతో పాఠశాలల్లోనే ఉంటున్నారు. వైద్యాధికారులు ముందు జాగ్రత్తలు పరీక్షలు చేయగా, 50 సంవత్సరాల వ్యక్తితో పాటు ఆయన బంధువైన 18 సంవత్సరాల యువతికి, 42 సంవత్సరాల మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో కరోనా కలకలం రేపినట్లయింది. ఇదిలా ఉంటే కథలాపూర్‌ మండలం తక్కళ్లపెల్లికి చెందిన వ్యక్తి ఇటీవల భార్య, కూతురితో కలిసి స్వగ్రామానికి వచ్చారు. కుటుంబ పెద్దకు పాజిటివ్‌ రాగా, అనుమానంతో కూతురికి పరీక్షలు చేయగా, 6 సంవత్సరాల బాలికకు బుధవారం పాజిటివ్‌ అని తేలింది. కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బకు చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి ముంబాయిలో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లి వచ్చాడు.


వ్యాధి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా భార్యాభర్తలిద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. వీరిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించగా, భర్త చనిపోయాడు. విషయం తెలుసుకున్న ముంబాయిలో ఉంటున్న కొడుకు, కోడలు రాగా, వారికి పరీక్షలు చేయగా బుధవారం కోడలికి పాజిటివ్‌ వచ్చింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్‌కు చెందిన వ్యక్తి ఇటీవల ముంబాయి నుంచి రాగా, వ్యాధి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఈ 12 మందిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

 

54కు చెందిన కరోనా పాజిటివ్‌ కేసులు

జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం ఒకే రోజు 12 మందికి రావడంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 54కు పెరిగింది. రాష్ట్రంలోనే వలస కార్మికులకు అత్యధికంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన జాబితాలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి 7,702 మంది వచ్చారు. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 5,822 మంది ఉన్నారు. ఇందులో ముంబాయి నుంచి వచ్చినవారే 5,300 మంది వరకు ఉంటారు.


ఇప్పటివరకు 394 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 54 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముంబాయి నుంచి వచ్చినవారికి 50 మందికి పాజిటివ్‌ రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇందులో ఇద్దరు మరణించగా, ప్రస్తుతం 48 మంది హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒకే రోజు 12 మందికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబాయి నుంచి వచ్చినవారు ఎవరు బయటకు వెళ్లకుండా, హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2020-05-28T11:05:56+05:30 IST