‘మేఘా’కు 12 సిటీ గ్యాస్‌ లైసెన్సులు

ABN , First Publish Date - 2022-01-29T08:54:01+05:30 IST

సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు 11వ రౌండ్‌ బిడ్డింగ్‌ ఫలితాలను పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) శుక్రవారం ప్రకటించింది. మొత్తం 65 భౌగోళిక ప్రాంతాల(జీఏ)కు బిడ్డింగ్‌ నిర్వహించగా.. ..

‘మేఘా’కు 12 సిటీ గ్యాస్‌ లైసెన్సులు

   అదానీ టోటల్‌కు అత్యధికంగా 14

  గుంటూరు, కర్నూలు, ప్రకాశం  జిల్లాల జీఏ లైసెన్సు ఐఓసీకి.. 

 జోగులాంబ గద్వాల్‌, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌,

    నారాయణ్‌ పేట్‌,   వనపర్తి జీఏ లైసెన్సు మేఘాకు..  

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు 11వ రౌండ్‌ బిడ్డింగ్‌ ఫలితాలను పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) శుక్రవారం ప్రకటించింది. మొత్తం 65 భౌగోళిక ప్రాంతాల(జీఏ)కు బిడ్డింగ్‌ నిర్వహించగా.. 61 జీఏలకు బిడ్లు లభించాయి. అందులో 52 జీఏల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అదానీ టోటల్‌ గ్యాస్‌ అత్యధికంగా 14 ప్రాంతాల లైసెన్సులను దక్కించుకుందని పీఎన్‌జీఆర్‌బీ తెలిపింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)కు 12 లైసెన్సులు లభించాయి. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 8 లైసెన్సులు చేజిక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలను కలిపి ఒక భౌగోళిక ప్రాంతంగా పరిగణించి బిడ్డింగ్‌ నిర్వహించగా.. ఐఓసీ ఈ ప్రాంత లైసెన్సును కైవసం చేసుకుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణ్‌పేట్‌, వనపర్తితో పాటు కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లాల జీఏ లైసెన్సు మేఘాకు లభించింది. కాగా, తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, కామరెడ్డి జిల్లాలతో కూడిన జీఏ లైసెన్సు మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌కు దక్కింది. 

Updated Date - 2022-01-29T08:54:01+05:30 IST