శవాల దిబ్బగా ఇల్లు

ABN , First Publish Date - 2021-06-11T08:14:43+05:30 IST

అర్ధరాత్రి 11:15 గంటల సమయం. అది ముంబై మల్వానీ ప్రాంతంలోని ఓ ఇల్లు. ఇంటిపెద్ద రఫీక్‌ షేక్‌కు చాయ్‌ తాగాలనిపించి.. పాల ప్యాకెట్‌ కోసం బయటకొచ్చాడు...

శవాల దిబ్బగా ఇల్లు

  • కూలిన పక్కనున్న మూడంతస్థుల భవనం 
  • ఆ శిథిలాల ధాటికి కుప్పకూలిన ఇల్లు
  • ఇంట్లోనివారిలో 12 మంది సజీవ సమాధి

ముంబై, న్యూఢిల్లీ, జూన్‌ 10: అర్ధరాత్రి 11:15 గంటల సమయం. అది ముంబై మల్వానీ ప్రాంతంలోని ఓ ఇల్లు. ఇంటిపెద్ద రఫీక్‌ షేక్‌కు చాయ్‌ తాగాలనిపించి.. పాల ప్యాకెట్‌ కోసం బయటకొచ్చాడు. షాపులో పాల ప్యాకెట్‌ కొనుక్కొని వచ్చి చూసే సరికి.. ఇల్లున్న చోట పెద్ద శిథిలాల కుప్ప కనిపించింది! శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు అప్పటికే స్థానికులు గుమిగూడారు. మట్టిపెళ్లలు, రాళ్లు అవీ తొలగిస్తున్నారు. రఫీక్‌ షేక్‌ దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఇంట్లో భార్య, పిల్లలు, సోదరుడి భార్య, పిల్లలు మొత్తంగా 18 మందికి ఏమీ జరగకూడదని దేవుడిని మొక్కుకున్నాడు. కానీ కుటుంబసభ్యుల్లో 12 మంది శిథిలాల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో 8 మంది పిల్లలున్నారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం పక్కన చట్టవిరుద్ధంగా నిర్మించిన ఓ మూడంతస్థుల భవనమే! అందులోని రెండస్థులు బుధవారం రాత్రి కూలిపోవడంతో ఆ శిథిలాలన్నీ పడి ఈ ఇల్లు కూలిపోయింది.   రఫీక్‌ భార్య, సోదరుడు, ఆయన భార్య, పిల్లలు మృత్యువాతపడ్డారు.  16 ఏళ్ల కుమారుడు అవసరమైన మాత్రలు తెచ్చుకునేందుకు  మెడికల్‌ షాప్‌కు వెళ్లడంతో బతికిపోయాడు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చట్టవ్యతిరేకంగా భవన నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2లక్షల చొప్పున రూ.24 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున సాయం ప్రకటించారు. ఘటన పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రూ.60 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.


Updated Date - 2021-06-11T08:14:43+05:30 IST