124 రైతుబజార్లు

ABN , First Publish Date - 2020-04-01T10:18:05+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన కూరగాయలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేస్తోంది.

124 రైతుబజార్లు

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన కూరగాయలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. ఇంకో రెండు వారాలు (ఏప్రిల్‌ 14 వరకు) ప్రజలంతా ఇళ్లకు పరిమితమై వుండాల్సిన నేపథ్యంలో వారికి అన్నీ అందుబాటులో వుంచడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇంతకుముందు జిల్లాలో కేవలం 13 రైతుబజార్లు మాత్రమే ఉండేవి. వీటిలో అత్యధికం విశాఖ నగరంలోనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతుబజార్లలో రద్దీ పెరగడంతో మరో 18 బజార్లను తాత్కాలికంగా సమీపంలోని మైదానాల్లో ఏర్పాటుచేశారు.


అయినా జనాలు పెద్దసంఖ్యలో వస్తుండడం, అన్నిచోట్ల భౌతికదూరం పాటించకపోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ మరిన్ని రైతుబజార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మైదానాల్లో తాత్కాలిక రైతుబజార్ల సంఖ్యను 49కి పెంచారు. మొబైల్‌ రైతుబజార్లను 62 చేశారు. దాంతో జీవీఎంసీ పరిధిలో ప్రతి వార్డు ప్రజలకు అందుబాటులో కూరగాయలు లభించే వీలు ఏర్పడింది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలినవి బుధవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు మార్కెటింగ్‌ శాఖ జారీచేసిన కార్డు వుంటేనే రైతుబజార్లలో సరకులు విక్రయించుకోవడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు కార్డులు లేకున్నా...ఎవరైనా వారి ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.


వారానికి ఒకటే రేట్లు

రైతుబజార్లలో విక్రయించే కూరగాయలు, నిత్యవసరాల ధరలను ఏ రోజుకారోజు ప్రకటిస్తారు. ప్రతిరోజు జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో విక్రయించే ధరల ఆధారంగా రైతుబజార్‌లో రేట్లు నిర్ణయిస్తారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్నిరోజులు లారీలు తిరగకపోవడం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి రకాలు రాకపోవడంతో వాటి రేట్లు పెరిగాయి. వ్యాపారులు నిల్వ చేసిన సరకులు ఎక్కువ రేట్లకు అమ్ముకునే ప్రయత్నం చేశారు. దాంతో బయట వ్యాపారులూ రేట్లు పెంచేశారు. ఉల్లి ధర రైతుబజారులో కిలో రూ.30 వుంటే బయట రూ.40 వరకు అమ్మారు. ఇలాంటి దోపిడీని నివారించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.


రోజూ ధరలను మార్చకుండా...వారం అంతా ఒకటే రేటు వుంచాలని మంగళవారం ఆదేశించారు. రైతుబజార్లు, తాత్కాలిక మైదాన బజార్లలో ఇవే ధరలు అమలులో ఉంటాయి. మొబైల్‌ బజార్ల నిర్వాహకులకు పెట్రోల్‌, డీజిల్‌ వ్యయం వుంటుంది కాబట్టి వారు కిలోకి అదనంగా పది శాతం ఎక్కువ రేటుకు అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారు. అంటే ఉల్లి కిలో రైతుబజారులో రూ.30 అయితే మొబైల్‌ బజారులో రూ.33 అమ్ముకోవచ్చు. ఇవి వీధుల్లోకే వచ్చి సరకులు అందిస్తాయి. కొనుగోలుదారులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. 


బజార్లు ఎక్కడెక్కడ అంటే...?


సీతమ్మధార రైతుబజార్‌ పరిధిలో హెచ్‌బీ కాలనీ, బుల్లయ్య కాలేజీల్లో తాత్కాలిక బజార్లు పెట్టారు. డాక్టర్స్‌ కాలనీ, ఎంఆర్‌ఓ ఆఫీసు, ఆర్‌టీసీ కాంప్లెక్స్‌, సంపత్‌ వినాయక్‌ గుడి, సీతంపేట, కేఆర్‌ఎం కాలనీల్లో మొబైల్‌ బజార్లు ఏర్పాటు చేశారు.


ఎంవీపీ కాలనీ రైతుబజార్‌ పరిధిలో ఏఎస్‌ రాజా గ్రౌండ్‌, ఆరిలోవ జిల్లా పరిషత్‌ పాఠశాలలో తాత్కాలిక బజార్లు పెట్టారు. అప్పుఘర్‌, జోడుగుళ్లపాలెం, పాత వెంకోజీపాలెం, శివాజీ పార్కు ఏరియా, ఉషోదయ జంక్షన్‌, హెచ్‌బీ కాలనీ, విశాలాక్షినగర్‌, పైనాపిల్‌ కాలనీ, సాగర్‌నగర్‌, రుషికొండ జంక్షన్‌, పెదగదిలి టీఎస్‌ పాయింట్‌, ఎండాడ, ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 9, ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 11, చినగదిలి, ఆరిలోవ 13వ వార్డు, ఆరిలోవ దుర్గాబజారు, ఆరిలోవ 12వ వార్డు, ఆరిలోవ రవీంద్రనగర్‌లో మొబైల్‌ బజార్లు ఏర్పాటుచేశారు.


నరసింహనగర్‌ రైతుబజార్‌ పరిధిలో డీఎల్‌బీ స్కూల్‌ మైదానం, ఆంధ్రజ్యోతి కార్యాలయం పక్కన ఖాళీస్థలంలో తాత్కాలిక బజార్లు పెట్టారు. అక్కయ్యపాలెం శివాలయం, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌, కప్పరాడల్లో మొబైల్‌ బజార్లు ఏర్పాటు చేశారు.


పెదవాల్తేరు రైతుబజార్‌ పరిధిలో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానం, కోటక్‌ స్కూల్‌ మైదానంలో తాత్కాలిక బజార్లు పెట్టారు. బీచ్‌ రోడ్డు కోస్టల్‌ బ్యాటరీ, కిర్లంపూడి లేఅవుట్‌, లాసన్స్‌బే కాలనీలో మొబైల్‌ బజార్లు ఏర్పాటు చేశారు.


గోపాలపట్నం రైతుబజార్‌ పరిధిలో జెడ్పీ హైస్కూల్‌లో తాత్కాలిక బజారు పెట్టారు. వేపగుంట జంక్షన్‌, లలితానగర్‌ అపార్ట్‌మెంట్‌, బాజీ జంక్షన్‌, ప్రహ్లాదపురం, సింహాచలం, విరాట్‌నగర్‌; నాయుడుతోట, గవర వీధుల్లో మొబైల్‌ బజార్లు పెట్టారు.


మర్రిపాలెం రైతుబజార్‌ పరిధిలో స్టెల్లా మేరీ స్కూల్‌, మురళీనగర్‌, జెడ్పీ స్కూల్‌లో తాత్కాలి బజార్లు, మాధవధార, వుడాకాలనీ, తెన్నేటి నగర్‌లలో మొబైల్‌ బజార్లు పెట్టారు.


గాజువాక రైతుబజారు పరిధిలో ఆదర్శ స్కూల్‌ మైదానంలో తాత్కాలిక బజారు, నడుపూరు కాలనీ, షీలానగర్‌ గ్లోరియస్‌ స్కూల్‌లో మొబైల్‌ బజార్లు పెట్టారు. 


పెదగంట్యాడ రైతుబజార్‌ పరిధిలో జెడ్పీ హైస్కూల్‌, గంగవరంలో తాత్కాలిక బజార్లు, దొడ్డివానిపాలెం, అల్లిపురంలలో మొబైల్‌ బజార్లు పెట్టారు.


స్టీల్‌ప్లాంటు రైతుబజార్‌ పరిధిలో శివశివానీ, లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాలల్లో తాత్కాలిక బజార్లు, దేశపాత్రునిపాలెం, సెక్టార్‌-2లో మొబైల్‌ బజార్లు పెట్టారు.


కంచరపాలెం రైతుబజార్‌ పరిధిలో గౌరీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తాత్కాలిక బజార్లు, రామాలయం వీధి, 104 ఏరియాల, న్యూకరాసల్లో మొబైల్‌ బజార్లు పెట్టారు.


పెందుర్తి రైతుబజార్‌ పరిధిలో జెడ్పీ హైస్కూల్‌లో తాత్కాలిక బజారు, చీమలాపల్లి, చినముషిడివాడల్లో మొబైల్‌ బజార్లు పెట్టారు.


మధురవాడ రైతుబజార్‌ పరిధిలో చైతన్య కాలేజీలో తాత్కాలిక బజారు, దుర్గానగర్‌, కార్‌ షెడ్‌, మల్కాపురాల్లో మొబైల్‌ బజార్లు పెట్టారు.


జీవీఎంసీ పరిధిలో మరో 18 తాత్కాలిక బజార్లకు ఏర్పాట్లుచేశారు.


అనకాపల్లి రైతుబజార్‌ పరిధిలో ఎన్‌టీఆర్‌ మార్కెట్‌ యార్డు, బాలాజీ నగర్‌లలో తాత్కాలిక బజార్లు పెట్టారు.


నర్సీపట్నం రైతుబజార్‌ పరిధిలో పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డు, ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీ, ఇందిరాగాంధీ అబిద్‌ జంక్షన్‌, బలిఘట్టం, నాతవరం పంచాయతీ కార్యాలయం వెనుక తాత్కాలి బజార్లు పెట్టారు.


పాయకరావుపేట, మాకవరపాలెం, చోడవరం, మాడుగులలో తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటుచేశారు.

Updated Date - 2020-04-01T10:18:05+05:30 IST