ఇండియా స్కిల్స్, 2021-సౌత్‌లో 124 మంది విజేతలు

ABN , First Publish Date - 2021-12-05T18:21:12+05:30 IST

నాలుగు రోజులపాటు జరిగిన ఇండియా స్కిల్స్ 2021

ఇండియా స్కిల్స్, 2021-సౌత్‌లో 124 మంది విజేతలు

విశాఖపట్నం : నాలుగు రోజులపాటు జరిగిన ఇండియా స్కిల్స్ 2021 రీజనల్ కాంపిటీషన్ - సౌత్‌లో 124 మంది విజేతలుగా నిలిచారు. ఈ పోటీలో 19-24 సంవత్సరాల మధ్య వయస్కులు దాదాపు 400 మంది పాల్గొన్నారు. వీరంతా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు చెందినవారు. 


51 వృత్తుల్లో ఈ పోటీలు జరిగాయి. ఇటుకలు పెట్టడం, ఆటో బాడీ రిపేర్, వెల్డింగ్, బ్యూటీ థెరపీ, హోటల్ రిసెప్షన్, మొబైల్ రోబోటిక్స్, హెల్త్ అండ్ సోషల్ కేర్, తోటను రమణీయంగా మలచటం, కార్పెంటరీ, పెయింటింగ్, డెకొరేషన్, వెబ్ టెక్నాలజీస్ వంటివాటిలో ఈ పోటీలు జరిగాయి. 


ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాస రావు బహుమతులు అందజేశారు. 62 మందికి బంగారు పతకాలు, ఒక్కొక్కరికి రూ.21,000 చొప్పున నగదు బహుమతి అందజేశారు. మరో 62 మందికి రజత పతకాలు, ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున నగదు బహుమతి ఇచ్చారు. 


కేరళకు అత్యధికంగా 32 పతకాలు లభించగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (29), తమిళనాడు (21), ఆంధ్ర ప్రదేశ్ (18), తెలంగాణా (2) ఉన్నాయి. వైల్డ్ కార్డ్ కేటగిరీలో 22 పతకాలను ప్రదానం చేశారు. 


ఇండియా స్కిల్స్ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతీయ పోటీల్లో గెలిచినవారు జాతీయ స్థాయిలో 2022 జనవరిలో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చు. జాతీయ స్థాయిలో స్వర్ణ, రజత పతకాలు గెలిచినవారు ప్రపంచ స్థాయిలో 2022 అక్టోబరులో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చు. 


Updated Date - 2021-12-05T18:21:12+05:30 IST