తెలంగాణలో 127 కరోనా కేసులు.. ఆందోళన కల్గిస్తున్న మరణాలు

ABN , First Publish Date - 2020-06-05T03:13:03+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తెలంగాణలో గురువారం 127 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 127 కరోనా కేసులు.. ఆందోళన కల్గిస్తున్న మరణాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తెలంగాణలో గురువారం 127 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 1,587 మంది డిశ్చార్జ్‌ చేశారు. 1,455 మందికి చికిత్స అందిస్తున్నారు.  కరోనా మహమ్మారి ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో 105 మంది మృతి చెందారు. గడచిన నాలుగు రోజుల్లోనే 23 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం ఒక్కరోజే మరో ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోది. ఇందులోభాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 143 కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్‌ జోన్‌లో 21, కూకట్‌పల్లి జోన్‌లో 10 కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశారు. చార్మినార్ జోన్‌లో 28, ఖైరతాబాద్ జోన్‌లో 35, శేరిలింగంపల్లి జోన్‌లో 16, సికింద్రాబాద్ జోన్‌లో 33 కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశారు.


ఇక్కడా.. అక్కడా.. అన్న తేడా లేకుండా గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా.. దాదాపు అన్ని చోట్ల ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం 50 నుంచి 100 వరకు కేసులు నమోదవుతున్నాయి. రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నిర్ధారణ అవుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. మార్కెట్లు, కిరాణా దుకాణాలు, చికెన్‌, మటన్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోన్నా.. ఇప్పటికీ కొందరు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. ప్రజా రవాణా ప్రారంభం కాకపోయినా ఆటోలు, క్యాబ్‌లు తిరుగుతున్నాయి. షేరింగ్‌ ఆటోల రాకపోకలూ మొదలయ్యాయి. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదు. ఆటోలు, క్యాబ్‌ల్లో ఎప్పటిలానే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇక షేరింగ్‌ ఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-05T03:13:03+05:30 IST