13 జిల్లాలు..160 ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2020-08-08T08:59:19+05:30 IST

వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు టీడీపీ హయాంలో అమరావతికి మించిన ప్రాధాన్యం ఇచ్చామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

13 జిల్లాలు..160 ప్రాజెక్టులు

  • సీమ, ఉత్తరాంధ్రకే పెద్దపీట వేశాం
  • అమరావతికి మించిన ప్రాధాన్యం
  • ఐఐటీ తిరుపతికి.. ఐఐఎం విశాఖకు..
  • 12 కేంద్ర విద్యాసంస్థలన్నీ వాటికే
  • అమరావతిలో ఒక్కటీ పెట్టలేదు
  • కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లిచ్చాం
  • కృష్ణా జలాలు సీమకు తరలించాం
  • అమరావతి రాష్ట్రానికి భారం కాదు
  • మొత్తం రాష్ట్ర అభివృద్ధికే చోదక శక్తి 
  • ఒక రాజధాని తర్వాత మరో రాజధాని..
  • వాటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా?
  • తెలుగువారి ఖర్మ ఇలా తిరగడమేనా?
  • మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన
  • అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది మేమే


‘రాజధాని మార్పు ఆలోచనే లేదని ఎన్నికల ముందు చెప్పారా లేదా? ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు?’ 


‘తనకు సోనియాగాంధీపై అపార నమ్మకం ఉందని, రాష్ట్ర విభజన వ్యవహారంలోకి ఆమెనుతేవొద్దని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అప్పట్లో జగన్‌ చెప్పారు.’

చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు టీడీపీ హయాంలో అమరావతికి మించిన ప్రాధాన్యం ఇచ్చామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్నో సంస్థలు, పరిశ్రమలు రాగా వాటిని ఆ ప్రాంతాలకే తరలించామని చెప్పారు. ‘ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం రాష్ట్రానికి వస్తే వాటినీ అమరావతిలో పెట్టలేదు. ఒకటి తిరుపతికి... మరొకటి విశాఖకు ఇచ్చాం. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర విద్యా సంస్థల్లో పన్నెండింటిని ఆ రెండు ప్రాంతాలకే ఇచ్చాం. అమరావతిలో ఒక్కటి కూడా పెట్టలేదు. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూనే.. మొత్తం 13 జిల్లాలకు కలిపి 160 ప్రాజెక్టులు ప్రకటించాం. అందులో కొన్ని అయ్యాయి. మరి కొన్ని కావలసి ఉంది’ అని వెల్లడించారు. ఆయన శుక్రవారమిక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు.


అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారా లేదా అని నిలదీశారు. ‘రాజధాని మార్పు ఆలోచనే లేదని ఎన్నికల ముందు చెప్పారా లేదా? ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? ప్రజలు ఆలోచించాలి.. నిలదీయాలి. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు. మొత్తం 5 కోట్ల మంది సమస్య’ అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి భారం కాదని... మొత్తం రాష్ట్ర అభివృద్ధికి చోదక శక్తి అవుతుందని చెప్పారు. అమరావతి నమూనా నచ్చడం వల్లే ఎంతో మంది పెట్టుబడులకు ముందుకు వచ్చారని తెలిపారు. కొత్త నగర నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గతంలో జగన్మోహన్‌రెడ్డి చెప్పిన విషయాలకు వైసీపీ నేతలు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. 2014 ఎన్నికల ముందు జగన్‌ కొత్త రాజధాని గురించి చెప్పిన విషయాలను ఈ సందర్భంగా ప్రదర్శించి చూపారు.


కొత్తగా ఒక నగరాన్ని రాష్ట్రానికి నడిబొడ్డులో నిర్మిస్తే అది అనేక మందిని ఆకర్షిస్తుందని, పెట్టుబడులను తెస్తుందని జగన్‌ అప్పట్లో చెప్పారు. ఆయనతోపాటు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, కన్నబాబు తదితరులు 2013లో చెప్పిన మాటలు.. గత ఎన్నికల ముందు చెప్పిన మాటలు... ఇప్పుడు చెబుతున్న మాటలను కూడా చంద్రబాబు ప్రదర్శించారు. తనకు సోనియాగాంధీపై అపార నమ్మకం ఉందని, రాష్ట్ర విభజన వ్యవహారంలోకి వాళ్లను తేవొద్దని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అప్పట్లో జగన్‌ చెప్పారు. వైసీపీకి ఓటు వేసినందుకు ఓ వ్యక్తి చెప్పుతో కొట్టుకుంటున్న దృశ్యాన్ని కూడా చూపించారు.  ఇంకా ఏమన్నారంటే..


ఎక్కువ రాయలసీమకే ఇచ్చాం..

‘నీళ్లు లేకుండా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావు. పోలవరం ద్వారా గోదావరి జలాలను బొల్లాపల్లి, బానకచర్ల మీదుగా రాయలసీమకు తీసుకెళ్లాలని డిజైన్‌ చేశాం. నాగావళి నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలకు తీసుకెళ్లాలనుకున్నాం. 63 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి అందులో 23 పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రూ.63 వేల కోట్లు ఖర్చు చేశాం. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలిచ్చాం. ఆ రకంగా కృష్ణా జలాలను పొదుపు చేసి రాయలసీమకు ఇచ్చాం. ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెచ్చాం. ఎక్కువ వాటిని రాయలసీమకే ఇచ్చాం. రూ.13 వేల కోట్లతో కియా కార్ల ఫ్యాక్టరీ అక్కడకే వచ్చింది. తిరుపతికి రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను కాలరాసి అరాచకం సృష్టిస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి.


ఒక రాజధాని తర్వాత మరో రాజధాని చుట్టూ తిరుగుతూ తెలుగువారు ఎంతకాలం ఇలా నష్టపోవాలి? తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో నాకెవరూ కులం ఆపాదించలేదు. అక్కడ లేని కులం అమరావతిలో ఎలా వచ్చింది? అమరావతిలో వేల ఎకరాల భూమి రాజధానికి ఎందుకు సేకరించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రైతుల వాటా... రోడ్లు, పార్కులు వంటివి పోను ప్రభుత్వానికి అక్కడ 8 వేల ఎకరాలు మిగులుతాయి. ఆ భూమిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ పోతే రాజధాని నిర్మాణం పూర్తి చేయడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎదురు నిధులిచ్చే శక్తి అమరావతికి వస్తుంది. ముంబై నుంచి ఏటా రూ.మూడున్నర లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే హైదరాబాద్‌ నుంచి రూ.60 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అటువంటి నగరం మనకు వద్దా?’

Updated Date - 2020-08-08T08:59:19+05:30 IST