కరోనాకు 13 మంది బలి

ABN , First Publish Date - 2021-05-17T04:14:30+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది.

కరోనాకు 13 మంది బలి
అంబులెన్స్‌లో నిరీక్షిస్తున్న వృద్ధురాలు

కొత్తగా 970 మందికి పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌, వనపర్తి (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/ కందనూలు/ వంగూరు/నారాయణపేట క్రైం, మే 16 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం ఏకంగా 13 మంది కరోనా కాటుకు బలయ్యారు. కొత్తగా 970 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 930 కరోనా టెస్ట్‌లు చేయగా, 110 మందికి పాజిటివ్‌  నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 886 పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్‌ వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 275 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 916 కరోనా పరీక్షలు నిర్వహించగా, పరీక్షల్లో 309 మంది కరోనా బారిన పడ్డారు. నారాయణపేట జిల్లాలో 820 మందికి పరీక్షలు నిర్వహించగా, 114 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 

బెడ్‌ దొరకక వృద్ధురాలి మృతి 

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రిలో బెడ్డు దొరకక సకీనాబీ (86) మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన సకీనాబీకి కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు శనివారం ఆమెను కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వైద్యులు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు పడకలు లేవని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆమెను అంబులెన్స్‌లోనే ఉంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్‌ కోసం ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అప్పటికే నాలుగున్నర గంటలు గడిచి పోవడంతో మరోసారి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన స్పందిస్తూ ఒక పేషంట్‌ డిశ్చార్జి అవుతున్నారని, వృద్ధురాలిని అడ్మిట్‌ చేసుకుంటామని చెప్పారు. కానీ ఆలోగా ఆమె అంబులెన్స్‌లోనే మృతి చెందారు. ఈ సంఘటనపై వైద్యులను వివరణ కోరగా, ఆసుపత్రిలో 50 బెడ్లు ఉన్నాయని, మరో పది బెడ్లు అదనంగా ఏర్పాటు చేసి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వంగూరు మండలంలోని రంగాపూర్‌తండాకు చెందిన ప్రజాప్రతినిఽధి భర్త (43), టీఆర్‌ఎస్‌ నాయకుడు కరోనాతో మృతి చెందాడు. గాజర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హిందీ పండితుడు (35) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మృతి విషయం అధికారులు ఇచ్చిన జాబితాలో నమోదు కాలేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన వ్యక్తి ఖమ్మంలో నివాసం ఉంటూ కరోనాతో మృతి చెందాడు. ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని అంగన్‌వాడీ టీచర్‌ ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

Updated Date - 2021-05-17T04:14:30+05:30 IST