ఢిల్లీలో దారుణాతిదారుణం.. 13 ఏళ్ల బాలుడికి లింగమార్పిడి చేసి ఆపై..

ABN , First Publish Date - 2021-01-16T02:04:53+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో జరిగిన అత్యంత దారుణ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడికి

ఢిల్లీలో దారుణాతిదారుణం.. 13 ఏళ్ల బాలుడికి లింగమార్పిడి చేసి ఆపై..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో జరిగిన అత్యంత దారుణ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడికి బలవంతంగా లింగమార్పిడి ఆపరేషన్ చేయించిన ఆరుగురు వ్యక్తులు ఆపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


దాదాపు మూడేళ్ల క్రితం ఓ డ్యాన్స్ కార్యక్రమంలో బాధిత బాలుడు లక్ష్మీనగర్‌ ప్రాంతంలో నిందితులను కలిశాడు. బాలుడిపై కన్నేసిన నిందితులు డ్యాన్స్ నేర్పిస్తాం రమ్మంటూ మండవలి ప్రాంతానికి పిలిపించారు. అలా డ్యాన్స్ నేర్చుకోవడానికి బాలుడు వారి వద్దకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాలుడికి కొంత మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో డ్యాన్స్‌ను కొనసాగించమని, తద్వారా జీవనాధారం లభిస్తుందని బాలుడికి చెప్పారు. 


తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు తనకు మత్తుపదార్థాలు ఇచ్చేవారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత వారు తనకు బలవంతంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించారని, హార్మోన్ మందులు కూడా ఇచ్చారని వాపోయాడు. దీంతో తాను కొంత కాలంలోనే అమ్మాయిలా మారిపోయానని వివరించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని విలపించాడు. విటులను కూడా తెచ్చి వ్యాపారం చేశారని పేర్కొన్నాడు. అంతేకాదు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్ష మెత్తాలంటూ బలవంతం చేసేవారని వివరించాడు. 


తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపేస్తామని, కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెడతామని బాలుడిని నిందితులు బెదిరించారు. గతేడాది మార్చిలో వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు ఎట్టకేలకు తన తల్లిని కలిశాడు. అయితే, బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న నిందితులు ఇంటికొచ్చి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఆ తర్వాత కొన్ని రోజులకు బాధిత బాలుడు, అతడి స్నేహితుడు కలిసి తప్పించుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రోజంతా దాక్కున్నారు. అక్కడ ఓ న్యాయవాది వారిని చూసి చేరదీసి ఢిల్లీ మహిళా కమిషన్ చెంతకు తీసుకెళ్లడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలురు ఇద్దరికీ పునరావాసం, రక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్టు మహిళా కమిషన్ తెలిపింది. 

Updated Date - 2021-01-16T02:04:53+05:30 IST