కరోనా లక్షణాలతో 13 ఏళ్ల బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-07-21T23:21:41+05:30 IST

అమెరికాలో 13 ఏళ్ల బాలుడు కరోనా లక్షణాలతో మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కరోనా లక్షణాలతో 13 ఏళ్ల బాలుడి మృతి

లాస్ ఏంజెలెస్ కౌంటి: అమెరికాలో 13 ఏళ్ల బాలుడు కరోనా లక్షణాలతో మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాకు చెందిన మాక్స్ చెంగ్ అనే బాలుడికి ఫోర్త్ ఆఫ్ జూలై(అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) రోజున కరోనా లక్షణాలు మొదలయ్యాయి. ఐదు రోజుల తరువాత అంటే.. జూలై తొమ్మిదో తేదీన మాక్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాల్లో నెగిటివ్ అని వచ్చింది. కరోనాకు సంబంధించి అన్ని లక్షణాలు కనిపిస్తున్నా కరోనా నెగిటివ్ రావడంపై మాక్స్ తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి మాక్స్‌లో కరోనా లక్షణాలు తగ్గలేదు. అయితే గత వారం మాత్రం లక్షణాలు కొద్దిగా తగ్గినట్టు అనిపించిందని మాక్స్ తల్లి చెబుతోంది. ఇక గత వారం చెకప్ కోసం మాక్స్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లామని.. చెకప్ గదిలో కూర్చొన్న మాక్స్ కొద్ది నిమిషాల తర్వాత పిలిచినా పలకలేదని తల్లి ఆవేదన వెల్లగక్కింది. అప్పటి వరకు బాగానే ఉన్న మాక్స్ ఉన్నట్టుండి మరణించాడని చెబుతూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మాక్స్ ఏ కారణం చేత మరణించాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాక్స్‌కు పోస్ట్‌మార్టం నిర్వహించామని.. కొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మాక్స్ మంచి స్విమ్మర్ అని.. ఎప్పటికైనా ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది అతడి డ్రీమ్ అని మాక్స్ తల్లి రోదిస్తూ చెప్పింది.

Updated Date - 2020-07-21T23:21:41+05:30 IST