నాన్న‌కు ప్రేమ‌తో అంటూ చిన్నారి త‌ల్లి సాహ‌సం!

ABN , First Publish Date - 2020-05-18T13:25:47+05:30 IST

కరోనావైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌ధ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు తమ సొంత రాష్ట్రాల‌కు తిరిగి రావడానికి ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

నాన్న‌కు ప్రేమ‌తో అంటూ చిన్నారి త‌ల్లి సాహ‌సం!

దర్భాంగ: కరోనావైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌ధ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు తమ సొంత రాష్ట్రాల‌కు తిరిగి రావడానికి ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చాలామంది వలస కార్మికులు నడక లేదా సైక్లింగ్ ద్వారా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ కోవ‌లోనే బీహార్‌లోని దర్భంగలో ఒక ఆస‌క్త‌క‌ర ఉదంతం చోటుచేసుకుంది. 13 ఏళ్ల చిన్నారి తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని వెయ్యి కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి, ఇంటికి చేరుకుంది. వివ‌రాల్లోకి వెళితే జ్యోతి తన తండ్రి మోహన్ పాస్వాన్‌ను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని హర్యానాలోని గురుగ్రామ్ నుంచి దర్భంగకు బయలుదేరింది. ఈ సంద‌ర్భంగా దారిలో ప‌లు సమస్యలు ఎదుర‌య్యాయి. కానీ జ్యోతి ధైర్యాన్ని కోల్పోకుండా అన్ని అడ్డంకుల‌ను దాటుకుంటూ వ‌చ్చింది. జ్యోతి తండ్రి గురుగ్రామ్‌లో ఈ రిక్షాలను న‌డుపుతుంటాడు. కొన్ని నెలల క్రితం అతనికి ప్రమాదం జరిగింది. ఈ కారణంగా అతని ఆరోగ్యం క్షీణించింది. ఇంతలో కరోనా కారణంగా లాక్‌డౌన్ అమ‌ల‌య్యింది. దీంతో ఉపాధి కోల్పోయాడు. ఈ రిక్షా యజమాని అద్దె చెల్లించమని ఒత్తిడి చేయ‌డం, మ‌రోవైపు ఇంటి యజమాని గదిని వదిలి వెళ్ళమని వేధించ‌డం ప్రారంభించారు. ఇటువంటి ప‌రిస్థితిలో తండ్రి  త‌న స్వ‌రాష్ట్ర‌మైన బీహార్ చేరుకునేందుకు వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లిస్తున్న లారీ య‌జ‌మానిని సంప్ర‌దించాడు. ఇందుకు అత‌ను ఆరు వేల రూపాయ‌లు అడిగాడు. అంత డ‌బ్బులు చెల్లించే స్థితిలో అత‌ను లేడు. దీంతో జ్యోతి తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని, మే 10న గురుగ్రామ్ నుంచి ప్ర‌యాణం ప్రారంభించింది. 16 న సాయంత్రం వారిద్ద‌రూ ఇంటికి చేరుకున్నాడు. ఆ చిన్నారి సాహ‌సాన్ని తెలుసుకున్న గ్రామ‌స్తులు ఆమెను అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. కాగా ప్ర‌స్తుతం తండ్రీకుమార్తెల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు. 

Updated Date - 2020-05-18T13:25:47+05:30 IST