13,041 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-18T07:37:59+05:30 IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రెండోరోజు నత్తనడకన సాగింది. తొలిరోజు 332 కేంద్రాల్లో 19,025 మందికి టీకాలు వేసిన ప్రభుత్వం రెండోరోజైన ఆదివారం 308 కేంద్రాల్లో 13,041 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించింది.

13,041 మందికి వ్యాక్సిన్‌

  • రాష్ట్రంలోని 308 కేంద్రాల్లో పంపిణీ
  • లక్ష్యం 27,233.. కానీ వేసింది 13 వేలే
  • 14,192 మంది వ్యాక్సినేషన్‌కు దూరం


అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రెండోరోజు నత్తనడకన సాగింది. తొలిరోజు 332 కేంద్రాల్లో 19,025 మందికి టీకాలు వేసిన ప్రభుత్వం రెండోరోజైన ఆదివారం 308 కేంద్రాల్లో 13,041 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించింది. ఆదివారం 312 కేంద్రాల్లో 27,233 మంది లబ్ధిదారులకు టీకా అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. ఆదివారం కావడంతో లబ్ధిదారులెవరూ పెద్దగా మొగ్గుచూపలేదు. 14,192 మంది టీకా తీసుకోలేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 6,784 మందికి మాత్రమే టీకా వేశారు. సాయంత్రం తాకిడి పెరగడంతో మొత్తం 13వేల మందికి వ్యాక్సిన్‌ అందించగలిగారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,959 మందికి టీకా అందగా.. ప్రకాశంలో 1,409, నెల్లూరులో 1,320, చిత్తూరులో 1,228, శ్రీకాకుళంలో 1,140, కర్నూలులో 1,025 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా తొలిరోజు  12,525 మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదు. వారు ఆదివారం కూడా టీకా వేయించుకోకపోతే వారికి మరో అవకాశం ఇవ్వబోమని కేంద్రం హెచ్చరించింది. దీంతో శనివారం టీకా వేయించుకోని వారిలో చాలామంది ఆదివారం తీసుకున్నారు.


శాస్త్రవేత్తలకు గవర్నర్‌ అభినందనలు

కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ధి చేసి, దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేయ డం సంతోషకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్‌ అభినందించారు.

Updated Date - 2021-01-18T07:37:59+05:30 IST