ఆ 134 మందీ చనిపోయినట్టే: తేల్చేసిన అధికారులు

ABN , First Publish Date - 2021-02-23T21:55:58+05:30 IST

గల్లంతైన వారిలో ఇప్పటికీ కనిపించకుండా పోయిన 134 మంది ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆ 134 మందీ చనిపోయినట్టే: తేల్చేసిన అధికారులు

చమోలి: ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విలయంలో గల్లంతైన వారిలో ఇప్పటికీ కనిపించకుండా పోయిన 134 మంది ‘మరణించినట్టుగా భావిస్తున్నట్టు’ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో రెండు మృతదేహాలను గుర్తించడంతో చమోలీ హిమానీనద విపత్తులో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 70కి చేరినట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇప్పటివరకు 29 మానవ అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 134 మంది జాడ తెలియకపోవడంతో వారంతా చనిపోయినట్టుగా భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ నేగి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యలకు డెత్ సర్టిఫికెట్‌లు అందించనున్నట్టు పేర్కొన్నారు. సాధారణంగా మరణ ధ్రువీకరణ పత్రాలు అందించే పరిస్థితులకు ఇది భిన్నమైనదని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.


బాధిత కుటుంబ సభ్యులు అవసరమైన అఫిడవిట్‌, ఇతర వివరాలను సంబంధింత అధికారులకు అందిస్తే , అప్పుడా అధికారి విచారణ అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం చేస్తారని అందులో పేర్కొన్నారు. గల్లంతైన వారి విషయంలో పరిహారానికి ఇది అవసరమవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారిని మూడు కేటగిరీలుగా పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం సమీపంలోని గల్లంతయిన ప్రజలను మొదటి కేటగిరీలో చేర్చగా, విపత్తు సంభవించిన ప్రాంతం వద్ద ఉండి గల్లంతైన ఇతర జిల్లాలకు చెందిన వారిని రెండో కేటగిరీలో చేర్చారు. మూడో విభాగంలో పర్యాటకులను చేర్చారు.  


Updated Date - 2021-02-23T21:55:58+05:30 IST