రాష్ట్రంలో మరో 136 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-08T10:05:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,702 శాంపిల్స్‌ పరీక్షించగా 136 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం

రాష్ట్రంలో మరో 136 కరోనా కేసులు

కర్నూలులో ఐదుగురు విద్యార్థులకు వైరస్‌

చిత్తూరు జిల్లాలోనే 49 మందికి పాజిటివ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,702 శాంపిల్స్‌ పరీక్షించగా 136 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 49 మందికి వైరస్‌ సోకింది. గుంటూరులో 15, అనంతపురంలో 14, విశాఖలో 12, కడప, కృష్ణా జిల్లాల్లో 11 కేసుల చొప్పున వెలుగుచూశాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 8,90,692 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 8,82,520కి పెరిగింది.  చిత్తూరు జిల్లాలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 7,174కి పెరిగాయి. 
ఐదుగురు హాస్టల్‌ విద్యార్థులకు..
కర్నూలు జిల్లా మహానంది మండలంలోని ఎం తిమ్మాపురం ప్రభుత్వ మోడల్‌ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. పాఠశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు రెండు రోజుల క్రితం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పోలిశెట్టి వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) (52) కరోనాతో మృతి చెందారు. ఆయనకు ఇటీవల జ్వరం రావడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు.  
టీకా తీసుకున్న వలంటీర్‌ మృతి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వలంటీర్‌ మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న దాసరి అజయ్‌కుమార్‌(21) గతనెల 24న టీకా వేయించుకున్నాడు. మరుసటి రోజు నుంచి జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడ్డాడు. ఈ నెల 1, 2 తేదీల్లో పింఛన్లు పంపిణీ కూడా చేశారు. 4వ తేదీన మళ్లీ జ్వరం రావడంతో తొలుత మార్టూరులో ఆ తర్వాత చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అక్కడి వైద్యుల సలహామేరకు ఆయనను గుంటూరులోని రమేష్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

Updated Date - 2021-03-08T10:05:26+05:30 IST