‘సంస్థా’...గతం!

ABN , First Publish Date - 2020-08-04T08:51:34+05:30 IST

నవ్యాంధ్రుల నూతన రాజధాని.. అందులో అన్ని శాఖల కార్యాలయాలు, వందల కంపెనీల ప్రధాన కార్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు...

‘సంస్థా’...గతం!

  • అమరావతిలో 139 సంస్థలకు తిలోదకాలే!
  • ఆర్‌బీఐ, సీబీఐ, నాబార్డు, ఎఫ్‌సీఐ సహా
  • 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు
  • 24 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కూడా..
  • అనేక ప్రైవేటు కంపెనీలకూ కేటాయింపులు
  • మొత్తం 139 సంస్థలకు 1239 ఎకరాలు
  • అవన్నీ వస్తే ఆర్థికంగా రాజధాని పరిపుష్టం
  • పాలనా రాజధాని తరలింపుతో
  • ఇక వీటన్నిటికీ చరమగీతమే!!
  • వేరే చోటకు వచ్చేది అనుమానమే


‘అద్భుత నగరిగా రూపుదిద్దుకునే అమరావతిలో మన ఉనికీ ఉండాలి’ అనే భావనతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు అక్కడ ఎంతోకొంత స్థలం కొన్నారు. వారే కాదు... ‘అమరావతి మన కార్యక్షేత్రం కావాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు భావించాయి. ప్రైవేటు సంస్థలూ తమ కార్యాలయాలు, విద్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇలా ఒకటీ రెండూ కాదు! ఏకంగా 139 సంస్థలు నవ్యాంధ్రలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమరావతిలో స్థలాలు తీసుకున్నాయి. సంస్థను, అవసరాన్ని బట్టి స్థలానికి ధర నిర్ణయించారు. ‘మూడు ముక్కలాట’లో  కేవలం శాసన రాజధానిగా మిగిలే అమరావతిలో అవి తమ సంస్థలను నెలకొల్పుతాయా?  వాటి పరిస్థితి ఏమిటి?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నవ్యాంధ్రుల నూతన రాజధాని.. అందులో అన్ని శాఖల కార్యాలయాలు, వందల కంపెనీల ప్రధాన కార్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు... వాటిలో రాష్ట్రానికి చెందిన అన్ని జిల్లాల వారికీ లక్షలాది ఉద్యోగాల కల్పన.. ఇదీ టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక! దానికి అనుగుణంగానే తొలి విడతలోనే దాదాపు 139 సంస్థలకు 1,239.42ఎకరాల భూములు కేటాయించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పిస్తారన్న ఉద్దేశంతో ఎకరం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఇలా భూములు పొందిన సంస్థల ద్వారా సుమారు 60 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. ఇన్ని సంస్థలు ఒకేచోట వస్తే జరిగే ఆర్థిక కార్యకలాపాల వల్ల మరిన్ని లక్షలమందికి ఉపాధి లభిస్తుంది. కానీ ఇప్పుడు పాలనా రాజధాని తరలింపుతో ఈ సంస్థలకు, యువతకు ఉపాధి అవకాశాలకు గండిపడినట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


కేంద్ర సంస్థలు 25, రాష్ట్ర సంస్థలు 24

రాజధానిలో గత ప్రభుత్వం భూములిచ్చినవాటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు 25 ఉన్నాయి. వీటిలో ఆర్‌బీఐ, సీబీఐ, నాబార్డు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కూడా ఉన్నాయి. అక్కడ ఆయా సంస్థలే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మిస్తాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవుతాయని అంచనా వేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 24 సంస్థలకూ భూములు కేటాయించారు. ప్రైవేటు సంస్థలకు కూడా భూకేటాయింపులు జరిపారు. బ్యాంకులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, వాణిజ్య భవనాలకు భూములిచ్చారు. రాజధానిలో తమ కార్యాలయాలు ఉంటున్నాయన్న ఉద్దేశం సదరు సంస్థలది కాగా.. అన్నింటినీ రప్పించి రాజధానిని ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి కల్పన కేంద్రంగా చేయాలన్నది నాటి ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు ఇదంతా కలగానే మారిపోనుందా? ఈ సంస్థలకు తిలోదకాలు ఇచ్చినట్లేనా? రాజధానినే మార్చేశాక ఇక సదరు భూములు పొందిన సంస్థలు ఇక్కడేం పెట్టుబడులు పెడతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కేంద్ర సంస్థలతో మాట్లాడి మరీ..

అమరావతి కోసం 33వేల ఎకరాల భూసమీకరణ, అనంతరం సింగపూర్‌ ప్రభుత్వంతో మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, ఆ తర్వాత రకరకాల కేసులను ఎదుర్కోవడం, గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కేసులను పరిష్కరించుకోవడం తదితర కార్యక్రమాలకే తొలి మూడేళ్లు గడిచిపోయాయి. అయినా ఆ సమయంలోనే ఒక పక్క సచివాలయం, మరో పక్క శాసనసభ భవనాలను నిర్మించారు. అనంతరం సిటీ కోర్టుల సముదాయాన్ని పూర్తిచేసి.. అందులో హైకోర్టు కార్యకలాపాలను పూర్తిస్థాయిలో సాగిస్తున్నారు. న్యాయమూర్తుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఐఏఎస్‌, ఐపీఎ్‌సల భవనాలు, ఉద్యోగుల క్వార్టర్లను 70-80 శాతం పూర్తిచేశారు. అదే సమయంలో ప్రతిష్ఠాత్మక సంస్థలు, కంపెనీలకు ఇక్కడ భూములిస్తే అభివృద్ది జరుగుతుందని ఆలోచించారు.


ప్రతి రాష్ట్ర రాజధానిలోను తప్పనిసరిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేంటన్నది పరిశీలించారు. అవన్నీ ఇక్కడకు వచ్చేలా ఒప్పించారు. వాటికి భూములు కేటాయించారు. రెండో విడతలో ప్రభుత్వం వద్ద ఇప్పటికీ ఉన్న వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయడం వల్ల వచ్చే ఆదాయంతో రాజధానిని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని భావించారు. అయితే ఇప్పుడు తొలి విడతలో భూ కేటాయింపు పొందిన సంస్థలే ఇక ఇక్కడకు వచ్చే అవకాశాలుండవని పలువురు పేర్కొంటున్నారు. ఈ సంస్థలన్నీ మరోచోటకైనా వస్తాయా అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదన్న సమాధానమే వ స్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వైఖరులు మార్చుకుంటూ వెళ్లడం వారిపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, ఈ సంస్థలు వెనకంజ వే స్తాయని చెబుతున్నారు.


భూ కేటాయింపు పొందిన ప్రసిద్ధ సంస్థలివే

మొత్తం 139 సంస్థలకు భూ కేటాయింపు చేయగా.. రూ.545 కోట్లు అప్పుడే చెల్లించాయి. ఇంకా రూ.146 కోట్లను చెల్లించాల్సి ఉంది. 25 కేంద్ర సంస్థలకు కలిపి 192ఎకరాలు, 24 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు 165 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ పీఎ్‌సయూలకు 23 ఎకరాలు, 4 రాష్ట్రప్రభుత్వ పీఎ్‌సయూలకు 11.27 ఎకరాలు కేటాయించారు. పలు బ్యాంకులు, విద్యాసంస్థలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు అక్కడ నిర్మాణాలు చేసేందుకు సొమ్ములు చెల్లించి భూములు తీసుకున్నాయి.




Updated Date - 2020-08-04T08:51:34+05:30 IST