Abn logo
Jun 11 2021 @ 03:52AM

ఇంట్లో కూర్చుని సాధించారు!

వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఐటీ ఎగుమతుల్లో 13% వృద్ధి

ఏడాదిలో లక్షన్నర కోట్ల ఎగుమతులు

చిన్న పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలి: కేటీఆర్‌


పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్రాలకు తోడ్పాటును అందించండి. విపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా రాష్ట్రాలను సమ దృష్టితో చూడాలి. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’

మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి):టీ ఎగుమతుల్లో తెలంగాణ 13% వృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కరోనా పరిస్థితుల్లోనూ ఐటీ రంగంలో మంచి పురోగతి సాధించామన్నారు. గురువారం ఆయన ఐటీ, పరిశ్రమల శాఖల 2020-21 వార్షిక నివేదికలను విడుదల చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1.28 లక్షల కోట్ల  ఐటీ ఎగుమతులు జరగ్గా 2020-21లో కరోనా పరిస్థితుల్లోనూ అవి రూ.1,45,522 కోట్లకు పెరిగాయని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐటీ కంపెనీలన్నీ వర్క్‌ఫ్రం హోం మోడ్‌లోకి వెళ్లినా ఎగుమతులు మాత్రం పెరిగాయన్నారు. కరోనా సమస్య లేని 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు రాష్ట్రంలో 17.93 శాతంగా ఉంది. 


వ్యవసాయంలో 20.9 శాతం వృద్ధి

2020-21లో రాష్ట్రం రూ.9.78 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధించిందని కేటీఆర్‌ చెప్పారు. కరోనాతో దేశ సగటు జీడీపీ 8 శాతం తగ్గితే తెలంగాణలో కేవలం 1.26 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏకంగా 20.9 శాతం వృద్ధి సాధించిందని వివరించారు. జాతీయ స్థాయిలో వ్యవసాయం సగటు పెరుగుదల కేవలం 3 శాతం ఉందన్నారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా రెండున్నర శాతమే కాగా జీడీపీలో మాత్రం 5 శాతం వాటా అందిస్తోందని చెప్పారు. దేశ వార్షిక తలసరి ఆదాయం రూ.1,27,768 ఉంటే తెలంగాణలో రూ.2,27,145 ఉందని చెప్పారు. 


ఐటీలో 46,489 కొత్త కొలువులు

కరోనా కాలంలోనూ ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాలు 8 శాతం మేర పెరిగాయని కేటీఆర్‌ తెలిపారు. 2020-21లో 46,489 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేవలం 2 శాతం వృద్ధి ఉందన్నారు. లాక్సెన్‌ సైన్స్‌, గ్యాన్యూల్‌ ఇండియా తలో రూ.4 వేల కోట్లతో విస్తరిస్తున్నాయని తెలిపారు. ఎస్టార్‌ ఫిలింటెక్‌ సంస్థ  చందనవెల్లిలో రూ.1350 కోట్లు పెట్టుబడులుగా పెడుతోందన్నారు. ఎలక్ర్టానిక్‌ రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 15 వేల ఉద్యోగాలు  కల్పించామని వివరించారు. 


ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ 

ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిని వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నగరాలకు విస్తరించి ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని కేటీఆర్‌ చెప్పారు. మహబుబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ఈ ఏడాది ఐటీ టవర్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో సోలార్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రామగుండం, సిద్దిపేట, నల్లగొండల్లో  రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. టీ హబ్‌ రెండో దశ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. టీ వర్క్స్‌ పేరుతో దేశంలోనే అతి పెద్ద ప్రొటో టైపింగ్‌ సర్వీసె్‌సను లాంఛనంగా ఆవిష్కరిస్తామని తెలిపారు.  


కేంద్రం తీరుపై అసంతృప్తి

చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తనకు తెలియదని అన్నారు.  రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని కోరారు.ఫార్మాసిటీకి భూసేకరణ పూర్తి

హైదరాబాద్‌ ఫార్మా సిటీ అభివృద్ధికి భూ సేకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్‌ శివారు చందనవెల్లిలో ఎలక్ట్రికల్‌ వాహనాల క్లస్టర్‌ను ఏర్పాటు చేశామని, కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి దగ్గర 500 ఎకరాల్లో న్యూఎనర్జీ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ‘టీ-యాప్‌ ఫోలియో’ యాప్‌లో రోజూ 7 వేల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు.


టీ వ్యాలెట్‌లో ఏకంగా 13.3 లక్షల మంది నమోదు చేసుకున్నాయని,  రూ.12 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని తెలిపారు. రోజుకు 23 వేల లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి 250 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ప్రభుత్వానికి అందిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, చేనేత, జౌళి శాఖల కార్యదర్శి శైలజ రామయ్యర్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌, టీఎ్‌సఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Advertisement