ఎన్‌కౌంటర్‌లో పొరపాటు.. 14 మంది పౌరులు, జవాన్ మృతి

ABN , First Publish Date - 2021-12-05T23:06:51+05:30 IST

నాగాలాండ్‌లో సైనిక సిబ్బంది కాల్పుల్లో 14 మంది పౌరులు సహా జవాన్ మృతి చెందారు. స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి..

ఎన్‌కౌంటర్‌లో పొరపాటు.. 14 మంది పౌరులు, జవాన్ మృతి

కొహిమా: నాగాలాండ్‌లో సైనిక సిబ్బంది కాల్పుల్లో పొరపాటు కారణంగా 14 మంది పౌరులు సహా జవాన్ మృతి చెందారు. స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మోన్ జిల్లాలోని ఓటింగ్-టిరు గ్రామాల మధ్యలో ఈ ఆపరేషన్ జరుగుతుండగా, రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగినట్లు నాగాలాండ్ ప్రభుత్వం పేర్కొంది.


కాగా, ఈ ఘటన అనంతరం నాగాలాండ్‌లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. నాగాలాండ్ వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలతో పాటు బల్క్ మెసేజ్ సేవలను రద్దు చేశారు. అంతే కాకుండా సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించారు. ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షిస్తుందని, ఈ ఘటనలో భాగస్వామ్యమైన ఆర్మీ జవాన్లపై కూడా విచారణ కొనసాగనున్నట్లు గవర్నర్ జగదీష్ ముఖి తెలిపారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఆదివారం ఉదయం స్పందిస్తూ, ఈ సంఘటను తీవ్రంగా ఖండించారు. అత్యున్నత స్థాయి సిట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే న్యాయం జరుగుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని ఓ ట్వీట్‌లో కోరారు.


ఎన్‌కౌంటర్ అనంతరం.. స్థానికులు భద్రతా బలగాలను చుట్టుముట్టి నిరసనకు దిగారు. అంతే కాకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నాగాలాండ్ పోలీస్ విభాగం ఆదివారం వెల్లడించింది.

Updated Date - 2021-12-05T23:06:51+05:30 IST