అధిక లాభాలంటూ 14 లక్షలు కొట్టేశారు!

ABN , First Publish Date - 2021-04-29T16:57:01+05:30 IST

అతని మాటలు నమ్మిన యువతి అతను చెప్పిన లింక్‌ ఓపెన్‌ చేసి

అధిక లాభాలంటూ 14 లక్షలు కొట్టేశారు!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : మొబైల్‌ అప్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురి నుంచి రూ. 14 లక్షలు కొల్లగొట్టారు సైబర్‌ నేరగాళ్లు. నగరంలో ఓ చానెల్‌లో పనిచేస్తున్న యువతికి గుర్తుతెలియని నంబర్‌ నుంచి వాట్సాప్‌ లింక్‌ వచ్చింది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఆ లింక్‌ గురించి చెప్పాడు. మార్కెట్లో మొబైల్‌ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించాడు. రిటర్న్‌ ఏ రోజుకారోజు మీ ఖాతాలో జమ చేస్తారని బురిడీ కొట్టించాడు. అతని మాటలు నమ్మిన యువతి అతను చెప్పిన లింక్‌ ఓపెన్‌ చేసి తొలుత రూ. 10వేలు పెట్టుబడి పెట్టింది. వెంటనే రోజుకు రూ. వెయ్యి చొప్పున ఐదు రోజులు రిటర్న్స్‌ జమ చేశారు. 


నాలుగు రోజుల తర్వాత ఆమెకు ఫోన్‌ చేసి ఎక్కువ మొత్తంలో పెడితే లాభాలు అధికంగా వస్తాయని నమ్మించారు. దాంతో ఆమె ఒకసారి రూ. 40వేలు, మరోసారి 50వేలు పెట్టింది. ఇలా విడతల వారీగా రూ. 5 లక్షలు పెట్టింది. మరో నలుగురు వ్యక్తులను చేర్పిస్తే మీకు, వాళ్లకు రిటర్న్స్‌, మీకు కమీషన్‌ ఇస్తామని చెప్పారు. ఆమె ఎవరినీ  చేర్పించలేదు. మరుసటి రోజు నుంచి రిటర్న్స్‌ ఆగిపోయాయి. వారికి ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ ఉంది. మోసపోయానని గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మరో కేసులో కార్వాన్‌కు చెందిన హేమంత్‌ రూ. 1.10 లక్షలు మోసపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ తరహా కేసులపై 10 రోజుల వ్యవధిలో 8 ఫిర్యాదులు అందాయి. సైబర్‌ నేరగాళ్లు మొత్తం రూ. 14లక్షలు కొల్లగొట్టినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎమ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-04-29T16:57:01+05:30 IST