అయ్య బాబోయ్‌..కార్పొరేషనా!?

ABN , First Publish Date - 2020-08-14T11:48:18+05:30 IST

సుమారు ఎనిమిది లక్షల జనాభా.. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో పెద్ద నగరం..

అయ్య బాబోయ్‌..కార్పొరేషనా!?

14 నెలలు..ముగ్గురు కమిషనర్ల బదిలీ

విభాగాల్లో అధికారులదీ అదే పరిస్థితి

రాజకీయ చదరంగంలో నగర పాలక సంస్థ

అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు

పట్టుతప్పుతున్న పాలన.. ప్రజా సమస్యలు గాలికి!


నెల్లూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : సుమారు ఎనిమిది లక్షల జనాభా.. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో పెద్ద నగరం.. జిల్లా మొత్తానికి వ్యాపార, వాణిజ్య, విద్యా, ఆరోగ్య కేంద్రం.. ఇంత పెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలన అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు పాలక వర్గం లేకపోవడం, మరోవైపు రాజకీయ జోక్యం మితిమీరడంతో కార్పొరేషన్‌ పాలన గాడి తప్పుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో ఇప్పటికి ముగ్గురు కమిషనర్లు అలా వచ్చి ఇలా వెళ్లారంటే పరిస్థితులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలు చెప్పినవన్నీ అధికారులు చేయకపోవడం వల్లే పట్టుబట్టి బదిలీ చేయిస్తున్నారు. మరికొంత మంది అధికారులు అలా ముందుకెళ్లలేక వారే స్వయంగా బదిలీ కోరుకుంటున్నారు. ఇంకొంత మంది ఒత్తిడి తట్టుకోలేక సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ పాలన పూర్తిగా పట్టుతప్పింది. అధికార పార్టీ నేతలు చెప్పిన పనులు మినహా సాధారణ పనులు జరగాలంటే సామాన్యులు అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఆపదలో ఆటలా..!

కరోనా మహమ్మారి జిల్లాను వణికిస్తోంది. ఇప్పుడు జిల్లాలో కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. అందులో మెజారిటీ కేసులు నగరంలోనే నమోదవుతున్నాయి. పరిస్థితి చేయి దాటుతుండడంతో నెల్లూరు నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం తప్ప ఉన్నతాధికారులకు మరో మార్గం కనిపించలేదు. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కార్పొరేషన్‌ పాలన ఎంత పటిష్టంగా ఉంటే కరోనా నియంత్రణ అంత త్వరగా సాధ్యమవుతుంది. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా సమయంలోనే ఇద్దరు కమిషనర్లు బదిలీ అయ్యారు. నగరంపై వీరు అవగాహన పెంచుకొని ఒక ప్రణాళిక రూపొందించుకునేలోపు బదిలీ కావాల్సి వస్తోంది. దీంతో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి అలీంబాష కమిషనర్‌గా పని చేస్తున్నారు.


కొత్త ప్రభుత్వంలో రెండు నెలలు గడవక ముందే ఆయన బదిలీ జరిగింది. ఆ తర్వాత పీవీవీఎస్‌ మూర్తి కమిషనర్‌గా వచ్చారు. మార్చిలో కరోనా కేసు నగరంలో నమోదైనప్పటి నుంచి ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. అయితే అధికార పార్టీ నేతలు చెప్పింది చేయలేదని ఏప్రిల్‌లో మూర్తికి బదిలీ ఆదేశాలు వచ్చాయి. అయితే నాటి పరిస్థితుల్లో కమిషనర్‌ను బదిలీ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని అప్పటి కలెక్టర్‌ నెల రోజులపాటు రిలీవ్‌ చేయలేదు. అయితే కలెక్టర్‌పై కూడా ఒత్తిడి తీసుకురావడంతో మూర్తికి స్థానచలనం తప్పలేదు.


తర్వాత నుడా వీసీగా ఉన్న బాపిరెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం, రెండు వారాల్లోనే రెగ్యులర్‌గా పోస్టింగ్‌ ఇవ్వడం జరిగిపోయాయి. అధికార పార్టీ నేతలు బాపిరెడ్డి కోరి తెచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఐఏఎ్‌సలను కమిషనర్లుగా నియమిస్తూ, నెల్లూరుకు కూడా ఓ ఐఏఎ్‌సను నియమించింది. అయితే 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులు రద్దు కావడం గమనార్హం. తర్వాత అధికార పార్టీ నేతల దెబ్బకు బాపిరెడ్డి కూడా వెనకడుగువేశారని, ఈ కారణంగానే ఆయన స్వయంగా బదిలీకు దరఖాస్తు చేసుకున్నారన్న ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. బాపిరెడ్డి కనీసం మూడు నెలలు కూడా కమిషనర్‌గా పనిచేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 


మితిమీరిన జోక్యం

మొదటి నుంచీ కార్పొరేషన్‌పై అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా షాడో ప్రజాప్రతినిధులుగా వ్యవహరించే కొందరు నేతలు పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకొని తమకు తెలియకుండా ఏ పనీ జరగకూడదన్న సంకేతాలు అధికారులు, సిబ్బందికి ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఈ కారణంగానే పాలన గాడితప్పుతోందన్న ప్రచారం జరుగుతోంది. కమిషనర్లే కాకుండా ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ వంటి పలు విభాగాల్లో పనిచేసే అధికారులు కూడా బదిలీ అవ్వడం, సెలవు పెట్టి వెళ్లిపోతుండడంపై కూడా అనేక ఊహాగానాలు కార్పొరేషన్‌లో కొనసాగుతున్నాయి. కరోనా వంటి విపత్కర సమయంలో ఇంత పెద్ద కార్పొరేషన్‌కు రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడం గమనార్హం. ఈ ప్రభావం ప్రజలపై ప్రత్యక్షంగా పడుతోంది. కార్పొరేషన్‌ను గాడిలో పెట్టాలంటే ఐఏఎస్‌ అధికారి అయితేనే కరెక్ట్‌ అని భావించిన కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు కమిషనర్‌గా ఐఏఎ్‌సను నియమించాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న కొందరు నాన్‌ ఐఏఎ్‌సను కమిషనర్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ గతి ఎటన్నది మరికొన్ని రోజుల్లోనే తేలుతుంది. 

Updated Date - 2020-08-14T11:48:18+05:30 IST