Abn logo
Sep 26 2021 @ 09:08AM

14 సార్లు ఆపరేషన్.. నడవలేదని కట్టుకున్న భర్త వదిలేసి వెళ్ళిపోతే.. ఆమె సాధించిన విజయం తెలిసి..

కర్నాల్(హర్యాణా): ఒక మనిషి రెండు మూడుసార్లు ఆపరేషన్ చేయించుకుంటేనే శారీరకంగా కోలుకోలేక, మానసికంగా కృంగిపోతాడు. అలాంటిది ఏకంగా 14సార్లు ఆపరేషన్ చేయించుకుంటే ఇక ఆ వ్యక్తి జీవితాంతం మంచానికే పరిమితమయ్యి బతుకుజీవుడా అంటూ కాలం వెల్లదీస్తాడు. కానీ హర్యాణాకు చెందిన ఒక అమ్మాయి మాత్రం అలా కాదు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 14 ఆపరేషన్లు జరిగినా ఏమాత్రం తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. చికిత్స జరిగింది శరీరానికే కానీ నా సంకల్పానికి కాదు అని పోరాడింది. తన కలను నెరవేర్చుకోవడంకోసం ముందుకు వెళ్లింది. మొదటి ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకున్నా.. మరోసారి పోరాడింది. మూడో ప్రయత్నంలో తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లోకి వెళ్తే..


హర్యాణాలోని కర్నాల్ జిల్లా దూపేడి గ్రామానికి చెందిన సురేష్, బబిత దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు ప్రీతి బెనివాల్‌, కుమారుడి పేరు పంకజ్ బెనివాల్. 2013లో ఎంటెక్ పూర్తిచేసిన ప్రీతి బెనివాల్.. గ్రామీణ బ్యాంక్‌లో క్లరికల్ ఉద్యోగం సాధించింది. 2013నుంచి 2016వరకు బహదూర్‌గఢ్‌లో ఉద్యోగం చేసింది. 2016లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ గ్రేడ్ II ఉద్యోగం సాధించి.. 2021 వరకు అక్కడే పని చేసింది. 2021 జనవరిలో ఢిల్లీలో మరో ఉద్యోగం సాధించింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌ట్రనల్ అఫైర్స్‌లో ఉద్యోగం సాధించింది. 


ప్రీతికి 2016 ఫిబ్రవరిలో మట్లౌడా బ్లాక్‌లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ కోసం గజియాబాద్‌కు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు తండ్రితోపాటు బయలుదేరింది. ట్రైన్ ఎక్కే సందర్భంలో పొరపాటున కాలు జారి కిందపడిపోయింది. మూడు రైల్వే బాక్సులు ఆమె మీదినుంచి వెళ్లాయి. దీంతో ఆమెకు బైపాస్ సర్జరీ చేశారు. అంతేకాకుండా మరో 14ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. కానీ ఆమె నడవడానికి వీలు పడకపోవడంతో మంచానికి పరిమితమైంది. ఈ ప్రమాదంలో తండ్రికి కూడా గాయాలయ్యాయి.


ప్రీతి లేచి నడవడానికి వీలుకాకపోవడంతో.. కట్టుకున్న భర్త వదిలేసి వెళ్లిపోయాడు. భర్త దూరంకావడంతో ఆమె ఏడవని రోజంటూ లేదు. కూతురి బాధచూసి తల్లిదండ్రులు ఆవేదన చెందేవారు. ఇలాగే ఉంటే కష్టమని భావించి, కూతురిని మళ్లీ చదువుకోమని ప్రోత్సహించారు. ఆమెకున్న సివిల్స్ కలను నెరవేర్చుకోమని ప్రోత్సహించారు. ప్రీతి కూడా సరేనని ముందుకుసాగింది. ఉద్యోగం చేసే సమయంలో ఆమెకు యూపీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్ కోసం సమయం సరిపోయేది కాదు. రైల్వే ప్రమాదం తర్వాత ఒక సంవత్సరంపాటు సమయం దొరకడంతో ప్రిపరేషన్‌‌కు సమయం లభించినట్లైంది. దీంతో ఆమె మొదటిసారి సివిల్స్ రాయగా ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయింది. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యింది. కానీ మెయిన్స్‌లో తప్పింది. మూడోసారి ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలని మరింత కష్టపడింది. 2020 సివిల్స్ పరీక్షల్లో 754 ర్యాంకు సాధించి ప్రీతి తన కలను నెరవేర్చుకుంది. భార్య సాధించిన విషయం తెలిసి భర్తతో పాటు అత్తామామలు ఆశ్చర్యపోయారు.

ప్రత్యేకంమరిన్ని...