1400 దాడులు, 27 హత్యలు

ABN , First Publish Date - 2021-06-19T08:44:09+05:30 IST

‘‘ప్రతిపక్షం తరఫున పోరాడితే దౌర్జన్యాలు, ఫ్యాక్షన్‌ హత్యలు చేయిస్తారా? కర్మకాండలకు వెళ్తున్న వారిని దారుణంగా నరికేశారు

1400 దాడులు, 27 హత్యలు

ప్రతీ ఒక్కరికీ వడ్డీతో చెల్లిస్తా

దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ చేయించాలి

కత్తితో రాజకీయాలు చేసే వాళ్లు ఆ కత్తికే బలవుతారు

కర్నూలు జిల్లాలో హత్యకు గురైన నేతల అంత్యక్రియల్లో పాల్గొన్న నారా లోకేశ్‌


కర్నూలు, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతిపక్షం తరఫున పోరాడితే దౌర్జన్యాలు, ఫ్యాక్షన్‌ హత్యలు చేయిస్తారా? కర్మకాండలకు వెళ్తున్న వారిని దారుణంగా నరికేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం, గ్రామాభివృద్ధి చేయడమే వాళ్లు చేసిన తప్పా? హత్యలు జరిగి 24 గంటలు గడిచినా నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదో సమాధానం చెప్పి తీరాలి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నాయకుల కుటుంబీకులను ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆ నాయకుల అంత్యక్రియ ల్లో పాల్గొన్నారు.  విలేకరులతో మాట్లాడుతూ...  హత్యలు, దౌర్జన్యకాండలతో జగన్‌ రెడ్డి ఫ్యాక్షన్‌ రెడ్డిగా మారి రాయలసీమలో రక్తం పారిస్తున్నారని విమర్శించారు. ఈ ఫ్యాక్షన్‌ రెడ్డి హయాంలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఇప్పటిదాకా 1400 దాడులు, 27 హత్యలు జరిగాయన్నారు. ప్రభాకర్‌రెడ్డి వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ను జనవరిలో స్వాధీనం చేసుకుని, ఎన్నికలు ముగిసినా వెనక్కు ఇవ్వకపోవడం వల్లే ఈ జంట హత్యలు జరిగాయని ఆరోపించారు. శ్రీకాంత్‌ రెడ్డి, రాజారెడ్డి, దామోదర్‌ రెడ్డితో పాటు మరో 15 మంది పేర్లను బాధిత కుటుంబీకులు స్వయంగా తనతో చెప్పారని, దమ్ముంటే వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, అధికారులు కూడా రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయిస్తున్నారని, ఏ ఒక్కరినీ మరచిపోకుండా   వడ్డీ చెల్లిస్తానని హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కత్తితో బతికేవారు, కత్తితో రాజకీయాలు చేసేవారు చివరకు ఆ కత్తికే బలైపోతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాము సింహాల్లాంటి వారమని, వేటాడటానికి వెనకాడబోమని హెచ్చరించారు. 


బాధితుల ఆవేదన 

‘‘ప్రతా్‌పరెడ్డిని 11 చోట్ల పొడిచారు. చెయ్యి నరికేశారు. నాగేశ్వరరెడ్డిని 16 చోట్ల పొడిచారు. మా నాన్న అన్నం పెడితే తిన్న స్థానిక ఎమ్మెల్యే.. ఆ చేతినే నరికించేశారు.  నాలుగు రోజుల క్రితం నంద్యాలకు కార్లో వెళ్తుండగా వెనుక నుంచి గుద్దారు. గడివేముల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చంపిన వారికి ఉరిశిక్ష పడేలా చూడండి సార్‌.  జగన్మోహన్‌రెడ్డి గూండాలను ప్రోత్సహించి ఎమ్మెల్యేలను చేస్తున్నారు’’ అంటూ బాధితుల కుటుంబీకులు లోకేశ్‌ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-19T08:44:09+05:30 IST