విభజన చట్టం కింద 14 వేల కోట్లు ఇచ్చాం

ABN , First Publish Date - 2020-09-21T08:34:09+05:30 IST

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 2020-21లో ఈ నెల 18 నాటికి రెండు కేటగిరీల కింద మొత్తం రూ.14,029.91 కోట్లు విడుదల

విభజన చట్టం కింద 14 వేల కోట్లు ఇచ్చాం

జీఎస్టీ బకాయి పెండింగ్‌ 4,627 కోట్లు

ఏపీపై పార్లమెంటులో కేంద్రం వెల్లడి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 2020-21లో ఈ నెల 18 నాటికి రెండు కేటగిరీల కింద మొత్తం రూ.14,029.91 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆదివారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.


ఈ నిధుల్లో కేంద్ర పన్నులు, సుంకాల రూపంలో రూ.8,960.91 కోట్లు, ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.5,069 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అదేవిధంగా, జీఎస్టీ పరిహారం కింద 2020-21లో గడిచిన ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఏపీకి రూ.4,627 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు.


ఇక, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.2,948.5 కోట్లను గ్రాంటు రూపంలో ఈ నెల 15న విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. కాగా, కరోనా నేపథ్యంలో రుణ గ్రహీతలకు వడ్డీ మాఫీ చేసి, ఉపశమనం కలిగించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టినట్లు ఠాకూర్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-09-21T08:34:09+05:30 IST