ఆసరా ఏది ?

ABN , First Publish Date - 2020-05-31T09:38:52+05:30 IST

ఆసరా పింఛన్‌ కోసం వయోపరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ గత అసెంబ్లీ

ఆసరా ఏది ?

జిల్లాలో కొత్త పింఛన్లకు 14,138 మంది అర్హులుగా గుర్తింపు

వయో పరిమితి కుదించినా మంజూరు కాని పెన్షన్‌

ఏడాదిన్నర గడిచినా  తప్పని ఎదురుచూపులు

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు 

కార్యరూపం దాల్చని సీఎం ఎన్నికల హామీ 


ఆసరా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధ్దిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.  వయో పరిమితిని కుదించడంతో పింఛన్‌ పొందడానికి కొత్తగా అర్హత సాధించిన వారి వివరాలు ప్రభుత్వానికి పంపించినా ఇంత వరకూ స్పష్టత రాలేదు. తమకు పింఛన్లు ఎప్పటి నుంచి వస్తాయోనని వారు  నిరీక్షిస్తున్నారు.  కార్యాలయాల చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) :  ఆసరా పింఛన్‌ కోసం వయోపరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి రాగానే  ఓటరు జాబితాల ఆధారంగా ప్రతి జిల్లాలో 57 నుంచి 64 ఏళ్లున్న వారిని ఎంపిక చేశారు. తగ్గించిన వయో పరిమితితో వికారాబాద్‌ జిల్లాలో కొత్తగా 14,138 మంది కొత్తగా ఆసరా పింఛన్లు పొందడానికి అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పింఛన్‌ మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించారు. వారికి  పింఛన్‌ఇచ్చే విషయమై ఇంతవరకూ స్పష్టమైన  ఉత్తర్వులు జారీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా వారికి ఇంకా  నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో 1,04,076 మంది ఆసరా లబ్ధిదారులున్నారు.


వారిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 35,250 మంది , వితంతు పింఛన్‌దారులు 49,228, దివ్యాంగలబ్ధిదారులు 12,945, గీతకార్మికులు 468, చేనేత కార్మికులు  168, బీడికార్మికులు 41, హెచ్‌ఐవీ బాధితులు 1,083, పైలేరియా రోగులు 213, ఒంటరి మహిళలు 4,680 మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత జూన్‌ నెలనుంచి దివ్యాంగ పింఛన్‌దారులకు రూ.3,016, ఇతర లబ్ధిదారులకు రూ.2,016కు పెంచారు. ప్రతినెలా ఆసరా  పింఛన్ల కింద లబ్ధిదారులకు రూ.22,27,62,216 చెల్లిస్తున్నారు. 


ఏడాదైనా కార్యరూపం దాల్చని హామీ

ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వృద్ధాప్య పింఛన్లకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితి అర్హతను 57 ఏళ్లకు కుదిస్తూ  కేసీఆర్‌ ప్రకటన చేశారు. వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికలు ముగియగానే 57 ఏళ్లకు పైబడిన వారిని జిల్లాలో అధికారులు గుర్తించారు.  14,138 మంది అర్హులు కాగా వీరిలో 8,545 మంది పురుషులు, 5,593 మంది మహిళలున్నారు. వారికి పింఛన్లు మంజూరు చేసే విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌ హామీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియక అర్హత కలిగిన వృద్ధులు కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


 జిల్లాలో ఎక్కువగా తాండూరు మునిసిపాలిటీ పరిధిలో 1,958 మంది అర్హత పొందగా, అత్యల్పంగా కోట్‌పల్లి మండలంలో 332 మంది ఉన్నారు. బంట్వారం మండలంలో 361 మంది, బషీరాబాద్‌ మండలంలో 819, బొంరా్‌సపేట్‌ మండలంలో 749, ధారూరు మండలంలో 526, దోమ మండలంలో 706, దౌల్తాబాద్‌ మండలంలో 448, కొడంగల్‌ మండలంలో 849 మందిని ఎంపిక చేశారు.


కులకచర్ల మండలంలో 795, మర్పల్లి మండలంలో 611, మోమిన్‌పేట్‌ మండలంలో 580, నవాబ్‌పేట్‌ మండలంలో 609, పరిగి మండలంలో 768, పెద్దేముల్‌ మండలంలో 736, పూడూరు మండలంలో 386, తాండూరు మండలంలో 766, వికారాబాద్‌ మండలంలో 411, వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో 1,236, యాలాల్‌ మండలంలో 492 మందిని కొత్తగా వృద్ధాప్య  పింఛన్ల కోసం ఎంపిక చేశారు.

Updated Date - 2020-05-31T09:38:52+05:30 IST