రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు

ABN , First Publish Date - 2022-07-27T06:52:44+05:30 IST

ఐదో తరం (5జీ) టెలికాం తరంగాల వేలం తొలి రోజు (మంగళవారం) ముగిసేసరికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌ పూర్తయింది.

రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు

తొలిరోజు 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి అద్భుత స్పందన 


నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌ పూర్తి 

3.3, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌కు అధిక డిమాండ్‌ 

గతంలో ఎవరూ ఆసక్తి చూపని 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ కోసమూ జోరుగా బిడ్డింగ్‌ 


న్యూఢిల్లీ: ఐదో తరం (5జీ) టెలికాం తరంగాల వేలం తొలి రోజు (మంగళవారం) ముగిసేసరికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌ పూర్తయింది. మొత్తం రూ.1.45 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు బిడ్లు లభించాయని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. టెలికాం శాఖ అంతర్గతంగా అంచనా వేసిన రూ.80,000 కోట్ల స్థాయి తొలిరోజు బిడ్డింగ్‌ కంటే 80 శాతానికి పైగా అధికమిది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతోపాటు అదానీ డేటా నెట్‌వర్క్స్‌ కూడా చురుకుగా బిడ్డింగ్‌లో పాల్గొన్నాయని.. 2016, 2021 సంవత్సరాల్లో జరిగిన వేలంలో ఎవరూ ఆసక్తి చూపని 700 మెగాహెట్జ్‌ బ్యాం డ్‌ స్పెక్ట్రమ్‌కూ బిడ్లు లభించాయని మంత్రి పేర్కొన్నారు. మొదటి రోజున లభించిన బిడ్లు అందరి అంచనాలను మించిపోయాయని, 2015 నాటి వేలం ద్వారా సమకూరిన రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం కంటే అధికమని ఆయన అన్నారు. అయితే, వేలం ప్రక్రియ పూర్తయ్యాక గానీ ఏ కంపెనీకి ఎంత స్పెక్ట్రమ్‌ లభించిందన్న విషయంపై స్పష్టత లభిస్తుంది.

మొదటి రోజున గరిష్ఠ, మధ్యస్థ ఫ్రీక్వెన్సీలైన 3.3, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు కంపెనీలు జోరుగా పోటీ పడినట్లు తెలిసింది. టెలికాం శాఖ డేటా ఆధారంగా విశ్లేషకుల అంచనాల ప్రకారం.. 3.3 గిగాహెట్జ్‌ బ్యాండ్‌ తరంగాల కోసం రూ.78,500 కోట్లు, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రూ.14,632 కోట్ల విలువైన బిడ్లు దాఖలై ఉంటాయని అంచనా. అలాగే, 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రూ.39,720 కోట్ల విలువైన ప్రాథమిక బిడ్లు దాఖలైనట్లు అంచనా. 800, 2,300 మెగాహెట్జ్‌ మినహా మిగతా అన్ని బ్యాండ్ల స్పెకా్ట్రనికి మొదటి రోజున బిడ్లు లభించినట్లు తెలిసింది. వేలం ఎన్ని రోజులు జరుగుతుందనేది బిడ్డర్ల నుంచి లభించే డిమాండ్‌, వారి బిడ్డింగ్‌ వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని టెలికాం శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం ఐదో రౌండ్‌ బిడ్డింగ్‌ ప్రారంభం కానుంది. ఈసారి ప్రభుత్వం రూ.4.31 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ల స్పెకా్ట్రన్ని విక్రయించనుంది. బిడ్డింగ్‌ విజేతలకు స్పెకా్ట్రన్ని 20 ఏళ్ల కాలానికి కేటాయిస్తారు.


ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు 

బిడ్డింగ్‌ విజేతలకు ఆగస్టు 15 నాటికల్లా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. తద్వారా దేశంలో 5జీ సేవలు సెప్టెంబరు నుంచి ప్రారంభం కావచ్చన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 20-25 నగరాలు, పట్టణాల్లో సేవలు అందుబాటులోకి రావచ్చని  ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-27T06:52:44+05:30 IST