రాష్ట్రానికి 1.45 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు

ABN , First Publish Date - 2021-05-08T08:56:10+05:30 IST

కొవిడ్‌-19 రోగులకు వేసే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలవారీగా కేటాయించింది.

రాష్ట్రానికి 1.45 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు

రాష్ట్రాలవారీగా కేటాయింపులు జరిపిన కేంద్రం

అవసరమైతే కంపెనీల వద్ద కొనుక్కోవచ్చని సూచన


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 రోగులకు వేసే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలవారీగా కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 1.45 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు 2.35 లక్షల ఇంజెక్షన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కోటాను పెంచాలంటూ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖను ఇంతకుముందు కోరాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేటాయింపులు చేశారు. ఇంతకుముందు ఏప్రిల్‌ 21 నుంచి మే 9 వరకు రాష్ట్రాలకు చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే తాజాగా ఈ ప్రకటన చేశామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 


ఏప్రిల్‌ 21 నుంచి మే 16 వరకు సరిపడా కేటాయింపులు జరుపుతున్నామంటూ ఆ శాఖ ప్రకటించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 53 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను కేటాయించామని, ఈ ఇంజెక్షన్లను తగినవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ చేయాలని సూచించింది. ఈ కేటాయింపులే కాకుండా ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు జరిపి రెమ్‌డెసివిర్‌లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. తమ ప్రాంతాల్లో వాటి వయల్స్‌ లభ్యమయ్యేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకోవాలని, చాలినన్ని వయల్స్‌ల కోసం మార్కెటింగ్‌ కంపెనీలకు ఆర్డర్లు పెట్టాలని పేర్కొంది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి 50% కరోనా రోగులు రాష్ట్రానికి వస్తున్నారని, దీంతో అదనపు ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ ఆవశ్యకత పెరిగిందని ప్రధానికి ఆయన వివరించారు.

Updated Date - 2021-05-08T08:56:10+05:30 IST