Omicron విజృంభణ.. మళ్లీ ఆంక్షల బాటలో భారత్ సహా 15 దేశాలు..!

ABN , First Publish Date - 2021-11-30T15:14:06+05:30 IST

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 12కు పైగా దేశాల్లో ఈ వేరింట్ తాలుకూ కేసులు బయటపడ్డాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఒమైక్రాన్ ఇలా తన ఉనికిని చాటుతోంది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆంక్షల బాట పట్టాయి. ఒమైక్రాన్ ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ...

Omicron విజృంభణ.. మళ్లీ ఆంక్షల బాటలో భారత్ సహా 15 దేశాలు..!

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 12కు పైగా దేశాల్లో ఈ వేరింట్ తాలుకూ కేసులు బయటపడ్డాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఒమైక్రాన్ ఇలా తన ఉనికిని చాటుతోంది. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆంక్షల బాట పట్టాయి. ఒమైక్రాన్ ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం హెచ్చరించడంతో ఈ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు భారత్ సహా 15 దేశాలు ప్రయాణ నిషేధాలు, ఆంక్షలు విధించాయి. ఈ జాబితాలో యూఏఈ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఒమన్, మొరాకో, జపాన్, ఇజ్రాయిల్, భారత్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఉన్నాయి. అసలు ఈ దేశాలు అమలు చేస్తున్న నిషేధ ఆంక్షలేంటి? ఏ దేశాల ప్రయాణికులపై విధిస్తున్నాయి? ఎప్పటి నుంచి అమలు చేయనున్నాయి? అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.  


యూఏఈ

ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శుక్రవారమే కీలక ప్రకటన చేసింది. ఏడు ఆఫ్రికన్ దేశాల(దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్) నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం(నవంబర్ 29) నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని యూఏఈ వెల్లడించింది. అలాగే ఈ దేశాల నుంచి ట్రాన్సిట్ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులపై కూడా నిషేధం విధించింది. అయితే, యూఏఈ నుంచి ఈ నిషేధిత దేశాలకు విమాన సర్వీసులకు మాత్రం అనుమతించాయి. దీంతోపాటు ఏడు దేశాల దౌత్యాధికారులు, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాలు కలిగిన వారికి ఈ నిషేధం నుంచి మినహాంపు ఇచ్చాయి. కాకపోతే వీరు యూఏఈ బల్దేరడానికి 6 గంటల ముందు విమానాశ్రయంలో పీసీఆర్ కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే యూఏఈ చేరుకున్న తర్వాత మరోసారి ఎయిర్‌పోర్టులో టెస్టు ఉంటుంది. ఇక యూఏఈ వచ్చిన తర్వాత 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. తొమ్మిదో రోజు మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ నిషేధిత దేశాలకు చెందిన ప్రయాణికులు యూఏఈ రావాలనుకుంటే 14 రోజుల పాటు వేరే దేశంలో స్టే చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్లకు యూఏఈలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.


సౌదీ అరేబియా

సౌదీ అరేబియా కూడా యూఏఈ బాటలోనే శుక్రవారమే ఏడు ఆఫ్రికన్ దేశాలపై బ్యాన్ విధించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌదీలో ప్రవేశం ఉండదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ ఏడు దేశాలలో కాకుండా వేరే దేశంలో 14 రోజులకు పైగా స్టే చేసిన ప్రయాణికులకు మాత్రం ఎంట్రీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. 


బహ్రెయిన్

సౌతాఫ్రికాలో ఒమైక్రాన్ వేరియంట్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారి ఆరు ఆఫ్రికన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది బహ్రెయినే. శుక్రవారం (నవంబర్ 26) నుంచే దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా ప్రయాణికులపై బ్యాన్ పడింది. కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైన బహ్రెయిన్ నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచన మేరకు రెడ్‌లిస్ట్ దేశాల జాబితాను రెడీ చేసి ఆ దేశ పౌర విమానయాన శాఖకు అందజేసింది ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ.


కువైత్

ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కువైత్ ఆదివారం(నవంబర్ 28) నుంచి తొమ్మిది ఆఫ్రికన్ దేశాల విమాన సర్వీసులను నిలిపివేసింది. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే నాన్-కువైటీల ఎంట్రీపై కూడా నిషేధం విధించింది. కువైత్ నిషేధం విధించిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, ఈశ్వతిని, జాంబియా, లెసోతో, మాలావి ఉన్నాయి. ఇక ఈ దేశాల నుంచి వచ్చే కువైటీ పౌరులు ఏడు రోజుల పాటు సంస్థాగత నిర్బంధం(ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్)లో ఉండాలనే నిబంధన విధించింది. 


ఒమన్

ఒమన్ కూడా ఏడు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే విమాన సర్వీసులు, ప్రయాణికులపై నిషేధ ఆంక్షలు విధించింది. వీటిలో దక్షిణ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, లెసోతో, ఈశ్వతిని, మొజాంబిక్ ఉన్నాయి. ఆదివారం(నవంబర్ 28) నుంచి ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 


మొరాక్

శరవేగంగా ప్రబలుతున్న ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మొరాక్ సైతం ప్రపంచ దేశాలన్నింటినీ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. సోమవారం(నవంబర్ 29) నుంచి రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. "మహమ్మారిపై చేసిన పోరాటంలో మొరాకో సాధించిన విజయాలను సంరక్షించడం, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటం" కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


జపాన్

ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. ఇక ఇప్పటికే కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ చేసినట్లు ఆ దేశ ప్రధాని ఫుమియో కీషీదా మీడియాతో అన్నారు. తాత్కాలికంగా కొన్ని నిషేధ ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్న ప్రధాని, ఒమైక్రాన్ గురించి పూర్తి సమాచారం తెలిసిన తర్వాత మరిన్ని ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 


ఇజ్రాయిల్

దక్షిణ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడిన తర్వాత ఇజ్రాయిల్ కూడా శనివారం(నవంబర్ 27) నుంచి దేశ సరిహద్దులను పూర్తిగా క్లోజ్ చేసేసింది. 14 రోజుల పాటు ప్రపంచ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ వెల్లడించారు. అలాగే వేరియంట్ యొక్క వ్యాప్తిని గుర్తించడానికి కౌంటర్-టెర్రరిజం ఫోన్-ట్రాకింగ్ సాంకేతికతను ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. 


అమెరికా

అగ్రరాజ్యం అమెరికా కూడా ఒమైక్రాన్ నేపథ్యంలో ఎనిమిది సౌతాఫ్రికన్ దేశాలపై ఆంక్షలు విధించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, మొజాంబిక్, మాలావి దేశాల ప్రయాణికులపై సోమవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అలాగే ఈ ఎనిమిది దేశాల నుంచి వచ్చే విదేశీయులు కూడా 14 రోజుల పాటు వేరే దేశంలో స్టే చేస్తేనే యూఎస్‌లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలియజేశారు. 


బ్రిటన్

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో 10 దక్షిణాఫ్రికన్ దేశాలపై యూకే బ్యాన్ విధించింది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా, జింబాబ్వే, లెసోతో, ఈశ్వతిని నుంచి వచ్చే విమానాలను శుక్రవారం(నవంబర్ 26) నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే ఐరిష్, బ్రిటన్ పౌరులు స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన హోటళ్లలో 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలి. 




భారత్

ఒమైక్రాన్ కారణంగా భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాలతో పాటు వాటితో లింకులున్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కరోనా టెస్టు తప్పనిసరి చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా,  చైనా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్, బోత్స్వానా, మారిషస్, రెండు యూరోప్ దేశాలు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు భారత ఆరోగ్యశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. ఈ  దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, కోవిడ్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. 


బ్రెజిల్

ఒమైక్రాన్ కారణంగా బ్రెజిల్ కూడా ఆరు సౌతాఫ్రికన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శుక్రవారం ప్రకటించారు.


కెనడా

ప్రపంచ దేశాల ప్రయాణికులు తమ దేశానికి రాకుండా కెనడా దేశ సరిహద్దులను మూసివేసింది. ఒమైక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


ఆస్ట్రేలియా

ఒమైక్రాన్ తొలి కేసు నమోదైన నేపథ్యంలో దేశ సరిహద్దులను మరో రెండు వారాల పాటు మూసి ఉంచనున్నట్లు సోమవారం ఆసీస్ వెల్లడించింది. 


సింగపూర్ 

ఒమైక్రాన్ ప్రభావిత దేశాల నుండి ప్రయాణానికి రవాణా కేంద్రాలుగా పరిగణించబడే కొన్ని మధ్యప్రాచ్య దేశాలకు టీకాలు వేసిన ప్రయాణ మార్గాల ప్రారంభాన్ని సింగపూర్ వాయిదా వేసినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated Date - 2021-11-30T15:14:06+05:30 IST