ఒక్కో వెంటిలేటర్‌కు 15 మంది క్యూ

ABN , First Publish Date - 2021-05-04T07:28:38+05:30 IST

సార్‌..! మీరేమైనా చేయండి..! ఓ వెంటిలేటర్‌ బెడ్‌ ఇప్పించి.. మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి..

ఒక్కో వెంటిలేటర్‌కు 15 మంది క్యూ

  • హైదరాబాద్‌ మహానగరంలో వెంటిలేటర్లకు కొరత.. 
  • చేతులెత్తేస్తున్న బడా కార్పొరేట్‌ ఆస్పత్రులు
  • మొదటి వేవ్‌లో వెంటిలేటర్‌పై 4 రోజుల చికిత్స
  • సెకండ్‌ వేవ్‌లో 15 రోజులకు పెరిగిన అవసరం
  • బెడ్‌ దొరికితే చాలంటున్న పరిస్థితులు
  • రూ. 50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఓ వ్యాపారి


(హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): సార్‌..! మీరేమైనా చేయండి..! ఓ వెంటిలేటర్‌ బెడ్‌ ఇప్పించి.. మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి..! మీకు రూ. 50 లక్షలు ఇస్తా’’ ఇదీ కొవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన తన 35 ఏళ్ల కుమారుడిని కాపాడాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారి.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌. తనకు బిల్లుకూడా వద్దని, తానిచ్చే మొత్తం ఎక్కువ అనిపిస్తే.. మిగతా డబ్బుతో పేదలకు వైద్యం చేయాలని కోరాడా తండ్రి. అంత ఆఫర్‌ ఇచ్చినా.. వెంటిలేటర్‌ బెడ్‌ దొరకడానికి ఒకరోజు పట్టింది. ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటన.. హైదరాబాద్‌ మహానగరంలో వెంటిలేటర్ల కొరత తీవ్రతకు దర్పణం పడుతోంది. హైదరాబాద్‌లో ఒక్కో వెంటిలేటర్‌ బెడ్‌ కోసం 15 మంది కొవిడ్‌ రోగులు క్యూకట్టారు.


ఆక్సిజన్‌ ఇస్తాం.. చనిపోతే మా బాధ్యత కాదు?

కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే.. సెకండ్‌వేవ్‌లో వెంటిలేటర్‌పై చికిత్సకు పట్టే సమయం బాగా పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు. ‘‘మొదటి వేవ్‌లో ఊపిరి పీల్చుకోలేకపోతున్న ఓ కొవిడ్‌ రోగిని వెంటిలేటర్‌పై పెడితే.. 4 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చేవాడు. సెకండ్‌వేవ్‌లో.. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ వేగంగా పెరుగుతుండడతో.. కోలుకోవడానికి 15 రోజులు పడుతోంది. ఇప్పుడు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్ల అవసరం పెరిగింది’’ అని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. వెంటిలేటర్‌ బెడ్‌లకు తీవ్ర డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణమని ఆయన వివరించారు. నగరంతోపాటు.. జిల్లాల నుంచి వెంటిలేటర్‌ బెడ్‌ల కోసం వస్తున్న వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ‘‘ఆక్సిజన్‌ బెడ్లు ఇస్తాం’’ అని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాత వెంటిలేటర్‌కు షిఫ్ట్‌ చేస్తామని, ఆలోగా జరగరానిది జరిగితే తమది బాధ్యత కాదని కరాఖండీగా చెప్పేస్తున్నారు. వెంటిలేటర్ల కోసం ఇంతలా డిమాండ్‌ పెరగడం ఎన్నడూ చూడలేదని వైద్యులు చెబుతున్నారు. ‘‘కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగానే.. ఎలాంటి లక్షణాలు లేని/కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు హోంఐసోలేషన్‌కే మొగ్గుచూపుతున్నారు. వారు వైద్యుల సలహాతో కాకుండా సొంతంగా చికిత్సలు చేసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యమే కొంపలు ముంచుతోంది. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ పెరిగిపోయి.. ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఫలితంగా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్‌ల అవసరం పెరుగుతోంది’’ అని కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్ల కొరత నేపథ్యంలో.. ప్రస్తుతం వెంటిలేటర్‌ బెడ్‌పై ఉన్నవారు కోలుకుని డిశ్చార్జి అయితేనో.. పరిస్థితి విషమించి చనిపోతేనో వేరొకరికి అవకాశం లేని పరిస్థితి నెలకొందని చెప్పారు.


ఆక్సిజన్‌ విషయంలో తేడా ఇదే..!

కరోనా ఇన్ఫెక్షన్‌తో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారికి ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి.. ప్రాణవాయువు అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఆక్సిజన్‌ అందిస్తే.. కోలుకుంటారు. ఇందుకోసం రోజుకు సగటున ఆరు లీటర్ల ఆక్సిజన్‌ అవసరం. అదే ఊపిరి తీసుకోలేకపోతున్న వారికి వెంటిలేటర్‌ బెడ్స్‌ అవసరం. వెంటిలేటర్‌ చికిత్సలో రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. రోగి సొంతంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చేదాకా వెంటిలేటర్‌ చికిత్స అందించాలి. ఆక్సిజన్‌ బెడ్‌పై ఉండేవారికి.. వెంటిలేటర్‌ చికిత్సకు సిబ్బంది అవసరం వేర్వేరుగా ఉంటుంది. ఐసీయూలో ఆక్సిజన్‌ పడకపై ఉండే నలుగురైదుగురికి కలిపి ఒక నర్సు ఉంటే సరిపోతుంది. వెంటిలేటర్‌ బెడ్‌ విషయంలో.. ఒక్కో రోగికి ఒక్కో నర్సు అవసరం తప్పనిసరి.


వెంటిలేటర్ల ఏర్పాటూ ప్రయాసే!

అవసరం ఉన్నప్పుడు అదనపు వెంటిలేటర్లను సమకూర్చుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతాయి. అయితే.. అది అంత సులభమైన వ్యవహారం కాదని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వహణ విభాగం అధికారి తెలిపారు. ‘‘హైరెసుల్యూషన్‌ వెంటిలేటర్‌కు రూ. 40 లక్షలు ఖర్చవుతుంది. ఎకానమీ వెంటిలేటర్‌ రూ. 15 లక్షలకు వస్తుంది. డిమాండ్‌-సరఫరా విషయాన్ని పక్కన పెట్టినా.. వెంటిలేటర్‌ కొన్నాక అదనపు  ఖర్చులుంటాయి. ఆటోమేటెడ్‌ కంట్రోలింగ్‌ బెడ్‌కు రూ. 1.50 లక్షలు, బెడ్‌కు అనుబంధ సామగ్రికి రూ. 3 లక్షలు, సిరంజి పంపులకు రూ. లక్ష, ఇతర పరికరాలకు, మానిటర్లకు మరో రూ. 2 లక్షలు అవసరం. ఈ ఖర్చంతా ఒక ఎత్తయితే.. వెంటిలేటర్‌ను నిరంతరం పర్యవేక్షించే మెడికల్‌ టెక్నీషియన్‌ను నియమించుకోవాలి. 24 గంటలూ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక నర్సు (మూడు షిఫ్టుల్లో ముగ్గురు) అవసరం’’ అని ఆయన వివరించారు. గతంలో ఓ ఆస్పత్రిలో 4 వెంటిలేటర్లు ఉంటే.. ఏడాదంతా సగటున ఒక్కదాని అవసరమే ఉండేదని, ఇప్పుడు డిమాండ్‌ పెరిగిందని ఎక్కువ యంత్రాలను కొనుగోలు చేస్తే.. కొవిడ్‌ తర్వాత వాటిని మూలకు పెట్టాల్సిందేనని చెబుతున్నారు. ఆ భయంతో చాలా ఆస్పత్రులు వెంటిలేటర్ల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.



Updated Date - 2021-05-04T07:28:38+05:30 IST