చెరువుల పర్యవేక్షణకు 15 బృందాలు

ABN , First Publish Date - 2020-10-22T07:17:13+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 185 చెరువులను పర్యవేక్షించేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ తెలిపారు.

చెరువుల పర్యవేక్షణకు  15 బృందాలు

అవసరమైన మరమ్మతులు చేపడతాయి

శాశ్వత మరమ్మతుల కోసం 40 కోట్లు అవసరం

జీహెచ్‌ఎంసీలో మూడు చెరువులు తెగాయి

వైబ్రేషన్స్‌ వల్లే కల్వకుర్తి పంపుహౌస్‌ మునక

ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌


హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 185 చెరువులను పర్యవేక్షించేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో వానాకాలం మొత్తం కురవాల్సిన వర్షాల్లో 90 శాతం గత ఏడు రోజుల్లోనే కురిశాయని చెప్పారు. అందుకే చెరువులు నిండాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అప్పా చెరువు, గుర్రం చెరువు, పల్లె చెరువు కట్టలు మాత్రమే తెగాయని, 53 చెరువుల కట్టలు డ్యామేజీ అయ్యాయని చెప్పారు. ఇంజనీర్ల బృందాలు ఆయా చెరువులను పర్యవేక్షించి వెంటనే అవసరమైన మరమ్మతులు చేపడతాయన్నారు. ఈ మరమ్మతులకు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌కు రూ.20 లక్షల వరకే మంజూరు చేసే అధికారం ఉండగా, దానిని రూ.2 కోట్లకు పెంచుతున్నామని చెప్పారు. మరిన్ని చెరువులు తెగినట్టుగా వార్తలు వస్తున్నాయని, అవి సరికాదని తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా 46 వేలకు పైగా చెరువులు ఉండగా, వాటిలో 121 చెరువుల కట్టలు తెగాయన్నారు. చెరువుల తాత్కాలిక మరమ్మతులకు రూ.10 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో చెరువులు, కుంటల ఆక్రమణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాచారం లేదన్నారు. ఈ చెరువులు, కుంటల భూములకు సంబంధించి ఇరిగేషన్‌ శాఖకు మ్యూటేషన్‌ కావడం, ఆన్‌లైన్‌లోకి ఎక్కించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. 

వైబ్రేషన్స్‌ వల్లే కల్వకుర్తి పంపుహౌ్‌సలోకి నీరు చేరి, పంపులు మునిగాయని రజత్‌ కుమార్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండటం, ఎక్కువ వరదలు వస్తుండటంతోనే నీటి ఒత్తిడి సంభవించి ఉంటుందని తెలిపారు. పాలమూరు పంపుహౌ్‌సలో బ్లాస్టింగ్స్‌ కారణంగానే కల్వకుర్తి పంపుహౌస్‌ మునిగిందనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారని, అలా జరిగి ఉండకపోవచ్చని చెప్పారు. దీనిపై స్టడీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.  


దెబ్బతిన్న చెరువుల వివరాలు 

(అఽధికారుల నివేదిక ప్రకారం)

              అంశం సంఖ్య

గండ్లు పడ్డ చెరువులు 419

బుంగలు పడ్డ చెరువులు 185

దెబ్బతిన్న ఇతర చెరువులు 319

మొత్తం 923


వర్షాలకు నిండిన చెరువుల వివరాలు

మొత్తం చెరువుల సంఖ్య 43,412

100  శాతం నిండిన చెరువులు 24,149

75-100 శాతం నిండిన చెరువులు 15,152

50-75 శాతం నిండిన చెరువులు 2,647

25-50 శాతం నిండిన చెరువులు 862

0-25 శాతం నిండిన చెరువులు 602


Updated Date - 2020-10-22T07:17:13+05:30 IST