Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరవిందుని అయిదు స్వప్నాలు

  • (15న శ్రీ అరవిందుల జయంతి)

భారతదేశం డెబ్భై అయిదవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమయింది. అయితే,  మహర్షి శ్రీ అరవిందుల 150వ జయంతి సందర్భం కూడా ఇదేనని చాలా మందికి తెలీదు. ఈ నేల మీద ప్రభవించిన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానులలో ఒకరుగా, భారత దేశంపై ఆయనకు ఉన్న దృక్పథాన్ని గుర్తు చేసుకోవడం, 1947 ఆగస్టు 15న, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చిన సందేశం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ‘‘నేను పుట్టిన తేదీన దేశానికి స్వాతంత్య్రం రావడం కాకతాళీయంగానో, ఆకస్మికంగానో జరిగింది. కాదు. దైవ శక్తి సమ్మతితోనే ఇది సంభవించింది’’ అని శ్రీ అరవిందులు పేర్కొన్నారు. ఆయన సాధించిన కార్యాల్లో, సాగించిన జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 

తన జీవితంలో సాకారం అవుతాయని కలలుగన్న ప్రపంచ ఉద్యమాలు విజయవంతమయ్యే మార్గంలో ఏ విధంగా ఉన్నదీ శ్రీ అరవిందులు వెల్లడించారు. స్వతంత్ర భారత దేశం దానికి నాయకత్వ పాత్ర ఎలా వహిస్తుందో  ప్రకటించారు. తన అయిదు స్వప్నాలలో మొదటిదాని గురించి ఆయన వివరిస్తూ ‘‘అది ఈ రోజు మనకు తక్షణ ప్రాధాన్యత ఉన్న విషయం... భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించడం గురించి, కానీ ఇప్పటికీ మనం ఐకమత్యాన్ని సాధించలేకపోయాం’’ అని అన్నారు. రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ‘‘అణగారిన వర్గాల సమస్యలు, హిందూ-ముస్లిం వర్గాల మధ్య మతపరమైన విభజన సమస్య తప్పనిసరిగా పరిష్కారం కావాలి. ఏ విధంగానైనా విభజన అనేది అంతరించాల్సిందే. రాజకీయపరమైన విభజనను శాశ్వతంగా ఆమోదించకూడదు. అది కేవలం ఒక తాత్కాలిక సాధనం మాత్రమే’’ అని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి విభజనల వల్ల భారతదేశపు అంతర్గత అభివృద్ధికి, శ్రేయస్సుకు అవరోధం కలగవచ్చు, ఇతర దేశాల మధ్య భారతదేశం స్థాయి బలహీనమవుతుంది, దాని భవిష్యత్తు బలహీనపడుతుంది లేదా నిస్పృహలోకి జారుకుంటుంది. భవిష్యత్తులో భారతదేశం గొప్ప స్థానానికి చేరాలంటే దీన్ని నివారించడం అవశ్యం’’ అని సూచించారు. డెబ్భై అయిదేళ్ళ తరువాత కూడా దీన్ని సాధ్యం చెయ్యగలిగే దశలో మనం ఉన్నామా?

ఆయన రెండవ స్వప్నం... ‘‘ఆసియా ప్రజల పునరుజ్జీవం, విముక్తి, మానవ నాగరికత పురోగతిలో తన ఘనమైన పాత్రను ఈ దేశం తిరిగి చేపట్టడం’’. సార్క్‌ ఛత్రం కింద ఉన్న కొన్ని ఆసియా దేశాల ఆకృతీకరణలో భారతదేశం తన శక్తి, సామర్థ్యాలతో తగిన పాత్ర పోషించడం ద్వారా ఇది సాకారమయ్యేలా కనిపిస్తోంది, అఖండ భారతం దిశగా ఇదొక ఘనమైన అడుగు అని కచ్చితంగా చెప్పవచ్చు.

శ్రీ అరవిందుల మూడో స్వప్నం... ‘‘సమస్త మానవాళికీ న్యాయమైన, ప్రకాశవంతమైన, ఉన్నతమైన జీవితం అందించడం అనే ఆశయం ప్రాతిపదికగా ప్రపంచ సమాఖ్య ఒకటి ఏర్పాటుకావడం.’’ ‘‘ఒక వినూత్న ఏకత్వ స్ఫూర్తి మానవజాతిని ఒకటిగా చేస్తుంది’’ అని శ్రీ అరవిందులు ప్రస్తావించిన మాటలను ఐక్యరాజ్య సమితి ద్వారా  ఒకటైన దేశాల మండలి కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. ‘‘ఈ ఏకీకరణ అందరి ప్రయోజనాల కోసమే. ఇక్కడ కూడా భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తులోకి చూస్తోంది, ఒక సాహసోపేతమైన, వేగవంతమైన అభివృద్ధి కలిగిన భవిషత్తుకు చేరువ చేస్తోంది’’ అని ఆయన చెప్పారు. 

నాలుగో స్వప్నం... ‘‘ప్రపంచానికి భారతదేశం ఇచ్చే ఆధ్యాత్మిక కానుక’’. ఇది ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘యూరప్‌, అమెరికాల్లో భారతీయ ఆధ్యాత్మికత ప్రవేశం మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. కేవలం భారతదేశ ఉపదేశాలనే కాదు, దాని మానసిక చైతన్య, ఆధ్యాత్మిక అభ్యాసాల మీద కూడా వారు ఎక్కువగా ఆధారపడుతున్నారు’’ అని శ్రీ అరవిందులు ప్రకటించారు. 

‘‘ ఆఖరి స్వప్నం... మానవ పరిణామ క్రమం మరో అడుగు ముందుకు వేయడం. దీని మూలంగా మనిషి ఉన్నతునిగా, అత్యున్నత స్పృహ కలిగినవాడిగా ఎదుగుతాడు, అతడు మొదట ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచీ, వ్యక్తిగత పరిపూర్ణత, ఒక పరిపూర్ణమైన సమాజాల కోసం కలలుకన్న నాటి నుంచీ... తనకు కలవరపాటు కలిగించిన, బాధించిన సమస్యలను పరిష్కరించడం ప్రారంభిస్తాడు. ఈ చొరవ భారతదేశం నుంచే వస్తుంది, దీని పరిధి తప్పనిసరిగా విశ్వమే... అయినప్పటికీ, ఉద్యమ కేంద్రం మాత్రం భారతదేశమే అవుతుంది’’ అని ఆయన ఆశించారు. 

సమున్నతమైన ఈ గొప్ప సంభావ్యతలను శ్రీ అరవిందులు భారతదేశానికి బహుమతిగా ఇచ్చారు; ఒక వైభవోపేతమైన భవిష్యత్తు వైపు నాయకత్వం వహించడం ఇక దేశం చేతిలోనే ఉంది.

- డాక్టర్‌ చలమాయి రెడ్డి

Advertisement
Advertisement