ఒకే రోజు 151 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు.. 40 మందికి జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-02-23T13:35:34+05:30 IST

రాచకొండ పరిధిలోని ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిల్లో సోమవారం ఒకే రోజు

ఒకే రోజు 151 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు.. 40 మందికి జైలు శిక్ష

హైదరాబాద్/కొత్తపేట : రాచకొండ పరిధిలోని ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిల్లో సోమవారం ఒకే రోజు 151 డ్రంకెన్‌ డ్రైవ్‌(డీడీ) కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్‌ అదనపు డీసీపీ జీ.మనోహర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేసుల వివరాలను వెల్లడించారు. ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో డీడీ తనిఖీల్లో పట్టుబడిన 151 మందిలో కోర్టులు 40 మందికి జరిమానాతో పాటు స్వల్ప (ఒకరోజు నుంచి 15 రోజులు) జైలు శిక్ష విధించాయన్నారు. పట్టుబడిన 151 మంది రూ. 3,35,100 జరిమానా చెల్లించారని తెలిపారు. 


భువనగిరి పరిధిలో అత్యధికంగా 48 డీడీ కేసులు నమోదయ్యాయని కుషాయిగూడలో అత్యల్పంగా 12 కేసులు నమోదు కాగా, ఎల్‌బీనగర్‌లో 29, మల్కాజిగిరిలో 23, ఉప్పల్‌లో 20, వనస్థలిపురం ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో 19 డీడీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డీడీ తనిఖీల్లో పట్టుబడిన 151 మందిలో 111 మందికి జరిమానా మాత్రమే విధించారని, 40 మంది మందు బాబులకు జరిమానాతో సహా జైలు శిక్ష విధించారని తెలిపారు.


15 రోజుల జైలు

ఆనంద్‌బాగ్ : డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి సోమవారం 5వ ప్రత్యేక ఎంఎం న్యాయస్థానం రూ.4000 జరిమానా, 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించిందని, మరో 22 మందికి అపరాద రుసుం విధించిందని మల్కాజిగిరి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కృష్ణ తెలిపారు. 

Updated Date - 2021-02-23T13:35:34+05:30 IST