మాయ మాటలు నమ్మి 151 సీట్లిచ్చాం..

ABN , First Publish Date - 2021-12-06T07:32:46+05:30 IST

ప్రభుత్వాన్ని కూల్చాలన్నా, నిలబెట్టాలన్నా ఉద్యోగులేనని, ఉద్యోగ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని..

మాయ మాటలు నమ్మి 151 సీట్లిచ్చాం..

  • అందుకే మావైపు చూడట్లేదు 
  • ప్రభుత్వాన్ని కూల్చాలన్నా, నిలబెట్టాలన్నా ఉద్యోగులే 
  • మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే 
  • చంద్రబాబుకు మా గురించి బాగా తెలుసు
  • 13 లక్షల మంది ఉద్యోగులు కాదు.. 60 లక్షల మంది ఓటర్లు 
  • ఏపీ జేఏసీ నేత బండి సంచలన వ్యాఖ్యలు!


విజయవాడ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలన్నా, నిలబెట్టాలన్నా ఉద్యోగులేనని, ఉద్యోగ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన కృష్ణాజిల్లా ఉద్యోగ నేతల అంతర్గత సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు.


‘నేను ఉన్నాను... నేను విన్నాను... అని మీరు చెప్పిన మాయమాటలు నమ్మి 151 సీట్లు తెచ్చాం. కాబట్టి మీరు మావంక చూడటం లేదు. ఆ రోజున 5 డీఏలు ఇవ్వలేను.. ప్రతిపక్షంలో కూర్చుంటానని చెప్పిన చంద్రబాబుకు ఉద్యోగుల గురించి బాగా తెలుసు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతికి 13 లక్షల మంది ఉద్యోగులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 60లక్షల మంది. వీరంతా తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. నిలబెట్టవచ్చు. ఈ శక్తి ముందు ఎవరైనా కూడా తలవంచాల్సిందే. రైతుల ఉద్యమ దీక్షను బట్టి ప్రధానమంత్రి సైతం దండం పెట్టి తప్పయిపోయిందని చెంపలు వేసుకున్నాడు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి. ఈ రోజున నువ్వు చేస్తున్న ఉద్యమం నీ కోసం.. నీ పిల్లల కోసం! భావితరాలకు ఉద్యమం ఎలా ఉండాలో చె ప్పేదాని కోసమే తప్ప.. నీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు! ఉద్యమం ద్వారా హక్కులు తెచ్చుకుంటామే తప్ప నీ దయాదాక్షిణ్యాలపై కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని మనవి చేస్తున్నా. జీతం ఒకటో తేదీన ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? గతంలో జీతం రావడం లేదని కలెక్టర్‌కు సాల్వింగ్‌ అని టె లిగ్రామ్‌ ఇస్తే.. ఎవరు జీతం ఇవ్వటం లేదో ఆ డ్రాయింగ్‌ ఆఫీసర్‌ను గందరగోళం చేసేవారు. ఇవాళ చచ్చిపోతున్నా కూడా జీతం అన్నా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు జీతం. ఒకటో తేదీన జీతం తీసుకోవటం మన హక్కు. మీరు గమనించారో లేదో జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. జూలై 29న తిరుపతిలో ఒక సమావేశంలో చెప్పా. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే పాలవాళ్ల దగ్గర, కూరగాయల వాళ్ల దగ్గర లోకువ అయిపోయిందని చెప్పా. ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక గర్వంగా ఉండేది. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి క్షీణమైపోయింది. ఈరోజు పాలవాళ్ల దగ్గర సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అన్న పరిస్థితి అయిపోయింది’’ అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.


కాగా, పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు సంచలనాన్నే సృష్టించాయి. ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద కాదని, ఉద్యమం ద్వారానే హక్కులు తెచ్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-12-06T07:32:46+05:30 IST