భారీ మంచు ఖండం నుంచి 152 బిలియన్ టన్నుల నీరు విడుదల

ABN , First Publish Date - 2022-01-27T22:08:32+05:30 IST

అంటార్కిటిక్ ద్వీపకల్పంలో ఓ భారీ మంచు ఖండం

భారీ మంచు ఖండం నుంచి 152 బిలియన్ టన్నుల నీరు విడుదల

న్యూఢిల్లీ : అంటార్కిటిక్ ద్వీపకల్పంలో ఓ భారీ మంచు ఖండం కరిగిపోతోంది. 2017లో వేరుపడిన ఈ మంచు ఖండం వైశాల్యం 5,719 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇది సగానికిపైగా కరిగిపోయింది. ఫలితంగా సముద్రంలోకి 152 బిలియన్ టన్నుల నీరు, పోషకాలు చేరాయి. ఈ వివరాలను ‘రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. 


అంటార్కిటికాకు సంబంధించిన లార్సన్ ఐస్ షెల్ఫ్ నుంచి 2017లో ఓ భారీ మంచు ఖండం వేరుపడింది. 5,719 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల ఈ మంచు ఖండం ఈశాన్య దిశగా ప్రయాణించి, 2021లో దక్షిణ జార్జియా ద్వీపానికి చేరింది. దీనిని ‘‘మెగా ఐస్‌బర్గ్’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) అభివర్ణించింది. ఇది వెడెల్ సముద్రంలోని చల్లని నీళ్ళలో ఉంటూ మొదటి రెండేళ్ళలో నిలకడగా ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది డ్రేక్ ప్యాసేజ్ గుండా ప్రయాణించినట్లు తెలిపింది. దక్షిణ అమెరికా, చిలీ, కేప్‌హార్న్- అంటార్కిటికా, సౌత్ షెట్లాండ్ ఐలండ్స్ మధ్య డ్రేక్ ప్యాసేజ్ జలాలు ఉన్నాయి. ఈ జలాల్లో ఈ మంచు ఖండం ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పరిస్థితి మారిపోయిందని ఈఎస్ఏ తెలిపింది. 2021 జనవరినాటికి దీనిలో 3,200 చదరపు కిలోమీటర్ల వరకు మంచు కరిగిపోయిందని, ఇప్పుడు రోడ్ ఐలండ్ కన్నా కాస్త పెద్దదిగా ఉందని తెలిపింది. 


లీడ్స్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పోలార్ అబ్జర్వేషన్ అండ్ మోడలింగ్ అండ్ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే ఈ మంచు ఖండంపై ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో నిర్వహించిన పరిశోధనలో మూడున్నరేళ్ళపాటు జరిగిన ప్రయాణంలో 544 క్యూబిక్ కిలోమీటర్ల మంచు కరిగిపోయిందని వెల్లడైంది. దక్షిణ జార్జియా వద్ద ఉన్న ఈ మంచు ఖండం సుమారు మూడు నెలల్లో దాదాపు 152 బిలియన్ టన్నుల తాజా నీటిని, న్యూట్రియెంట్లను విడుదల చేసినట్లు అంచనా వేశారు. దాదాపు 61 మిలియన్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపగలిగినంత నీరు విడుదలైనట్లు తెలిపారు. దీనివల్ల ఈ ఐలండ్‌లోని పర్యావరణ వ్యవస్థ ప్రభావితమవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. 


ఈ స్టడీ లీడ్ ఆథర్ అన్నే బ్రాక్‌మన్-ఫోల్గ్‌మన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఈ మంచు ఖండం (ఏ68ఏ) విడుదల చేసిన నీటి వల్ల కలిగే ప్రభావం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. సాధారణంగా మంచు ఖండం నుంచి వచ్చే చల్లని, తాజా నీరు దాని పరిసరాల్లోని సముద్ర జలాల భౌతిక లక్షణాలను మార్చుతుందన్నారు. జీవ సంబంధ ఉత్పత్తులను పెంచగలిగే న్యూట్రియెంట్లను విడుదల చేస్తుందన్నారు. ప్రస్తుతం దక్షిణ జార్జియాలోని పెంగ్విన్లు, సీల్స్, వేల్స్ వంటివాటికి మరింత ఎక్కువ ఆహారం లభించే అవకాశం ఉందన్నారు. 


Updated Date - 2022-01-27T22:08:32+05:30 IST