కొత్త కేసులు 1555

ABN , First Publish Date - 2020-07-10T08:22:51+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,555 కేసులు వెలుగులోకొచ్చాయి.

కొత్త కేసులు 1555

  • రాష్ట్రంలో 23814 పాజిటివ్‌లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,555 కేసులు వెలుగులోకొచ్చాయి. వీరిలో 1500మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 23,814కు చేరింది. తాజాగా 904మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 277కు పెరిగాయి. కృష్ణాజిల్లాలో ఒక్కరోజులోనే అత్యధికంగా 127మందికి వైరస్‌ సోకింది. కడప జిల్లాలో 115 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  పులివెందులలో 21మందికి పాజిటివ్‌ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 141మందికి వైరస్‌ నిర్ధారణయింది. సముద్ర తీర ప్రాంతం యు.కొత్తపల్లి మండలంలో 25 కేసులు నమోదయ్యాయి. చేపలు విక్రయించే ఓ మహిళ ద్వారా వీరికి వైరస్‌ వ్యాపించింది.


పిఠాపురంలో ఇటీవల అరెస్టయిన వ్యక్తికి కొవిడ్‌ నిర్ధారణయింది. అంబాజీపేటలో ఏసీటీవోకు, అమలాపురంలో డాక్టర్‌కు, ఉపాధ్యాయుడికి కరోనా సోకింది.  కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వైద్యుడితో పాటు ఆయన కుటుంబంలో మరొకరికి, బనగానపల్లెలో వీఆర్వోకు, కోడుమూరులో ఓ ఆర్‌ఎంపీకి వ్యాధి సంక్రమించింది. చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఓ ప్రముఖుడు(80) కరోనాతో మృతిచెందగా ఆయన కుటుంబంలో 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరులో 328 కేసులు నమోదయ్యాయి. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల(కేజీహెచ్‌)లో కొవిడ్‌ వైద్య పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్‌లో ముగ్గురు సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు.దీంతో ల్యాబ్‌ను మూసివేశారు.

Updated Date - 2020-07-10T08:22:51+05:30 IST