15 ఏళ్ల పిల్లాడితో 25 ఏళ్ల యువతికి పెళ్లి.. ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2021-07-16T03:52:23+05:30 IST

ఆ బాలుడి వయసు 15. ఆ యువతి వయసు 25. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

15 ఏళ్ల పిల్లాడితో 25 ఏళ్ల యువతికి పెళ్లి.. ఎలా బయటపడిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ బాలుడి వయసు 15. ఆ యువతి వయసు 25. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇదంతా చాలా రహస్యంగా జరిగింది. అసలు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు కూడా. అయితే పెళ్లికుమారుడి అక్క మొగుడు ఈ బండారం బయటపెట్టాడు. అసలు మైనర్ పిల్లాడికి పెళ్లేంటని అత్తమామలను నిలదీస్తే చంపేస్తానని బెదిరించినట్లు ఆ యువకుడు వెల్లడించాడు. దీంతో తాను నోరు మూసుకున్నానని, అయితే పెళ్లి తర్వాత కూడా తన భార్య, కుమార్తెను ఇంటికి పంపడానికి అత్తమామలు నిరాకరించారని అతను వాపోయాడు. దీంతో కోపం వచ్చి పోలీసుల వద్దకు వెళ్లి సాక్ష్యాధారాలతో సహా తన అత్తమామల కుటుంబాన్ని ఇరికించేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు మైనర్ బాలుడికి పెళ్లి ఏంటని ఆశ్యర్యపోయారు. ఈ ఘటన హరియాణాలోని హిసార్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడి ఫతేహాబాద్‌కు చెందిన ఒక మైనర్ బాలుడికి, డేభీ గ్రామానికి చెందిన పాతికేళ్ల యువతితో 2019 జూన్ 14న వివాహం జరగింది.



పెళ్లి నాటికి అబ్బాయి వయసు పదిహేను సంవత్సరాలే. అయినా సరే పెళ్లి జరిగిపోయింది. అప్పటి నుంచి అమ్మాయి అత్తారింటికి రాలేదు. దీంతో ఆ బాలుడి బావ గోవిందరామ్‌కు చిర్రెత్తింది. అంతే, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ అమ్మాయి కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడికి పెళ్లి చేయడం తప్పంటూ చెప్తే.. అత్తామామలు తనను బెదిరించారని, తన భార్యాపిల్లలను ఇంట్లో ఉంచుకొని ఇంటికి కూడా పంపలేదని గోవిందరామ్ తెలిపారు. తన భార్యను ఇంటికి పంపడానికి అత్తామామలు అంగీకరించకపోవడంతో కోపం వచ్చిన గోవిందరామ్.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన తంతు మొత్తం వివరంగా చెప్పేశాడు. అలాగే అతని బామ్మర్ది బర్త్ సర్టిఫికెట్, మార్క్‌షీట్, అంగన్‌వాడీ రికార్డులను తన వద్ద ఉన్న ఆధారాలుగా చూపించాడు. తన అత్తమామలు  బామ్మర్ది ధీరజ్(15)కు బలవంతంగా పెళ్లిచేశారంటూ కేసు వేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. మొత్తం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-07-16T03:52:23+05:30 IST