16 కేజీల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-06T05:00:29+05:30 IST

పేద, మధ్యతరగతితో పాటు యువతను టార్గెట్‌ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

16 కేజీల గంజాయి స్వాధీనం
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

ఐదుగురి అరెస్టు... పరారీలో మరొకరు

నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్‌


కడప(క్రైం), మే 5: పేద, మధ్యతరగతితో పాటు యువతను టార్గెట్‌ చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ బుధవారం ఓఎస్డీ దేవప్రసాద్‌, కడప డీఎస్పీ సునీల్‌, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. మైదుకూరు టౌన్‌ సాయినాధపురానికి చెందిన చీమల జనార్ధన్‌రెడ్డి కర్నూలు జిల్లా చాగలమర్రి టౌన్‌ శ్రీనివాసనగర్‌కు చెందిన సున్నం రామసుబ్బయ్య, ఒంటిమిట్ట మండలంలోని రైల్వేస్టేషన్‌ అరుంధతీకాలనీకి చెందిన మిణుకు రవిశంకర్‌, కమలాపురం టౌన్‌ దర్గావీధికి చెందిన సోమేసుల నాగార్జునసాగర్‌, అదే ప్రాంతానికి చెందిన సోమేసుల వెంకటలక్షుమ్మలు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. వీరు విశాఖపట్టణం ఏజన్సీ ఏరియా నర్శీపట్నానికి చెందిన సత్తిబాబు ద్వారా గంజాయిని లారీలలో తీసుకువచ్చి జిల్లాలోని కొంతమందికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వీరు పేద, మధ్యతరగతికి చెందిన వారితో పాటు విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. కడప డీఎస్పీ సునీల్‌ ఆధ్వర్యంలో చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు అమర్‌నాధరెడ్డి, సత్యనారాయణ సిబ్బందితో నిఘా ఉంచి ఈ ఐదుమందిని దేవునికడప రోడ్డులోని ఆర్చి వద్ద అరెస్టు చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయి, సెల్‌ఫోను, రూ.250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న విశాఖకు చెందిన సత్తిబాబు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.



Updated Date - 2021-05-06T05:00:29+05:30 IST