కజక్‌స్థాన్‌లో ఆందోళనలు.. 164 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-10T00:07:36+05:30 IST

మధ్య ఆసియా దేశమైన కజక్‌స్థాన్‌లో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు..

కజక్‌స్థాన్‌లో ఆందోళనలు.. 164 మంది మృతి

అల్మాటీ: మధ్య ఆసియా దేశమైన కజక్‌స్థాన్‌లో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారం రోజులుగా అట్టుడికి పోతున్న ఈ దేశంలో విదేశీయులు సహా దాదాపు 6 వేల మంది చిక్కుకుపోయారు. చనిపోయిన వారిలో 103 మంది అల్మాటీకి చెందినవారే కావడం గమనార్హం.


హనాల్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల్ని భారీగా పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగి హింసకు దారితీసింది. అల్మాటీలో ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఆందోళనకారులు దాడులు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. 


ఫలితంగా శాంతిభద్రతలు దిగజారాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 164కు పెరిగింది. వీరిలో 26 మంది ‘సాయుధ నేరగాళ్లు’, 16 మంది భద్రతాధికారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆందోళనల కారణంగా ఇప్పటి వరకు 175 మిలియన్ యూరోల ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రభుత్వం తెలిపింది.


అలాగే, వంద వ్యాపార సంస్థలు, బ్యాంకులపై దాడి, దోపిడీ జరిగిందని, 400 వాహనాలు  ధ్వంసమయ్యాయని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 5,800 మందిని నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో విదేశీయులు కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితులు అదుపులోకి వచ్చాయని అధ్యక్షుడు కసీమ్-జోమార్ట్ టోకాయెవ్ తెలిపారు. 


దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఎల్‌పీజీ గ్యాస్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. సబ్సిడీని ఎత్తేయడంతో ధరలు రెట్టింపై ప్రజలకు భారంగా మారాయి. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 

Updated Date - 2022-01-10T00:07:36+05:30 IST