కొవిడ్‌తో 17 మంది చిన్నారులు మృతి.. థర్డ్ వేవ్‌పై మేఘాలయ అప్రమత్తం..

ABN , First Publish Date - 2021-06-18T23:12:41+05:30 IST

మేఘాలయలో ఇప్పటి వరకు 5 వేల మంది 14 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది...

కొవిడ్‌తో 17 మంది చిన్నారులు మృతి.. థర్డ్ వేవ్‌పై మేఘాలయ అప్రమత్తం..

షిల్లాంగ్: మేఘాలయలో ఇప్పటి వరకు 5 వేల మంది 14 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా 17 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏఎల్ హెక్ పేర్కొన్నారు. అయితే కొవిడ్ పాజిటివ్ గర్భిణీలకు జన్మించిన పిల్లలెవరికీ కరోనా సోకలేదని ఆయన తెలిపారు. ‘‘ఇప్పటి వరకు 5,101 మంది 0-14 ఏళ్ల చిన్నారులు ఈ వ్యాధి బారిన పడినట్టు గుర్తించాం. గతేడాది నుంచి ఇప్పటి వరకు 17 మంది చిన్నారులు కొవిడ్‌తో మృతి చెందారు..’’ అని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో దండెత్తనున్నట్టు చెబుతున్న థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని హెక్ పేర్కొన్నారు. ‘‘కొవిడ్ థర్డ్ వేవ్ సన్నద్ధతలో భాగంగా షిల్లాంగ్‌లో ముందస్తుగా చిన్నపిల్లల ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయించాం. వెస్ట్ గారో హిల్స్‌లోని తూరా పట్టణంలోనూ, వెస్ట్ జైంటియా హిల్స్‌లోని జొవాయ్‌లో వీటిని నిర్మించనున్నాం..’’ అని మంత్రి వెల్లడించారు. మేఘాలయలో ఇప్పటి వరకు 5.44 లక్షల మందికి వ్యాక్సీన్ వేశారు. ఇందులో 75 వేల మంది రెండు డోసులు వేసుకున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 762 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2021-06-18T23:12:41+05:30 IST