సింగూరు గలగల

ABN , First Publish Date - 2020-09-21T07:19:14+05:30 IST

సంగారెడ్డి జిల్లా వరదాయిని పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ నెల 12వ తేదీన

సింగూరు గలగల

ప్రాజెక్టులో  17.116 టీఎంసీల నీరు 

తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగిన వరద 

ఆదివారం సాయంత్రానికి 6,138 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో నమోదు

ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి


సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ఈ నెల 11 వరకు ఉన్న నీరు 3.5 టీఎంసీలే. ఆదివారంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 17 టీఎంసీలను దాటింది. తొమ్మిది రోజుల వ్యవధిలోనే పెద్దఎత్తున వరద ప్రవాహం నమోదైంది.  ఈ నెల 12న వంద క్యూసెక్కుల ప్రవాహంతో ప్రారంభమై 18న 52,284 క్యూసెక్కుల వరకు నమోదైంది. అనంతరం క్రమేణా తగ్గుముఖం పట్టి ఆదివారం సాయంత్రానికి 6,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 523.600 మీటర్లు కాగా ప్రస్తుతం 520.670 మీటర్లకు చేరుకున్నది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్టుకు జలకళ మొదలవడంతో పర్యాటకులతో కిటకిటలాడుతోంది.


పుల్‌కల్‌, సెప్టెంబరు 20 : సంగారెడ్డి జిల్లా వరదాయిని పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ నెల 12వ తేదీన ప్రాజెక్టులోకి స్వల్ఫ వరదతో ప్రారంభమైన నీటి ప్రవాహం ఆదివారం వరకు ఆశించిన స్థాయిలో రావడంతో ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరిగి 17 టీఎంసీలు దాటింది. తొమ్మిది రోజుల్లోనే నీటి మట్టం గణనీయంగా పెరగడంతో ప్రజలు, రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తున్నది. నాలుగేళ్ల సుదీర్ఘానంతరం సింగూరు ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతండటంతో అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ఎం.హన్మంతరావు వేర్వేరుగా ప్రాజెక్టును సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రత్యేక పూజలు చేసి జలహారతి కూడా ఇచ్చారు. ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని పొదుపుగా జిల్లా అవసరాలకే వినియోగించేలా కృషి చేస్తానన్నారు. 


ప్రాజెక్టులోకి ఈ నెల 12వ తేదీ నుంచి వంద క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో మొదలైన వరద మెల్లమెల్లగా నలబై, యాబై వేల క్యూసెక్కుల వరకు చేరుకున్నది. అంతకుముందు ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా తొమ్మిది రోజుల్లోనే 13.6 టీఎంసీల వరద నమోదై 17 టీఎంసీల నీటి మట్టానికి చేరుకోవడం విశేషం. ప్రాజెక్టుకు ఎగువన గల కర్ణాటకలోని బీదర్‌ జిల్లా, మహారాష్ట్ర ప్రాంతం, జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురువడంతోనే ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిందని నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా రోజుకు టీఎంసీ చొప్పున మాత్రమే వరద నీరు వస్తున్నది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రోజురోజుకు ఇన్‌ఫ్లో తగ్గుతున్నదని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ రామస్వామి, జేఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 6,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 17.116 టీఎంసీలకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 523.600 మీటర్లకు 29.917 టీఎంసీలు. ఆదివారం సాయంత్రానికి 520.670 మీటర్లకు 17.116 టీఎంసీల నీటి  నిల్వలు ఉన్నాయి. మరో 13 టీఎంసీలకు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోనున్నది.


పర్యాటకుల కిటకిట

సింగూరు ప్రాజెక్టు పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. నాలుగేళ్ల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలకళ ఉట్టిపడుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టును తిలకించేందుకు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు పరిసరాలన్నీ సందడిగా మారాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు సదాశివపేట, జోగిపేట, పటాన్‌చెరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో తరలిరావడంతో ప్రాజెక్టు నుంచి రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. సందర్శకులు ప్రాజెక్టు పరిసరాల్లో సెదతీరుతూ తమ వెంట తెచ్చుకున్న తినుబండరాలు తింటూ ఉల్లాసంగా గడిపారు. ప్రాజెక్టు వంతెనపై అటూ ఇటూ తిరుగుతూ సెల్ఫీలు దిగారు. ప్రాజెక్టు దిగువన ఉన్న కూల్‌డ్రింక్‌, చేపల వేపుళ్ల దుకాణాల వద్ద సందర్శకులు ఎగబడ్డారు. 


ప్రాజెక్టు వరద వివరాలు

తేదీ ప్రవాహం(క్యూసెక్కుల్లో) 

12 100 

13   320

14   401

15   988

16 15,074 

17 45,282

18 52,284

19   23,974

Updated Date - 2020-09-21T07:19:14+05:30 IST