సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బాలికది.. హత్యా.. ఆత్మహత్యా ?

ABN , First Publish Date - 2020-06-29T17:42:51+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలోని గంగాహుస్సేన్‌ బస్తీకి చెందిన ఓ బాలిక(17) ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి ఇంట్లోనుంచి అదృష్యమై అనుమానస్పద స్థితిలో చుంచుపల్లి మండలం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బాలికది.. హత్యా.. ఆత్మహత్యా ?

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న కొత్తగూడెం బాలిక అనుమానస్పద మృతి ఘటన 

న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తల్లిదండ్రుల వినతి

ఘటనపై గవర్నర్‌ తమిళసై ఆరా 

  

చుంచుపల్లి(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలోని గంగాహుస్సేన్‌ బస్తీకి చెందిన ఓ బాలిక(17) ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి ఇంట్లోనుంచి అదృష్యమై అనుమానస్పద స్థితిలో చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్‌ పంచాయతీలోని బేరియం తండా రైల్వే ట్రాక్‌పై మృతిచెందిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఆరు రోజులుగా సదరు బాలిక మృతి ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుండడంతో ఇప్పటివరకు కొత్తగూడానికే పరిమితమై ఈ వ్యవహారం ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు రెండు  రోజుల క్రితమే భద్రాద్రి జిల్లా ఎస్పీని కలసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అనే విషయం నిగ్గు తేల్చాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వద్దకు వెళ్లి విన్నివించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. 


ఐపీఎస్‌ అధికారి దర్యాప్తు  

భద్రాద్రి జిల్లాలో మైనర్‌బాలిక మృతికి సంబంధించిన కేసును ఛేదించేందుకు భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఒక ఐపీఎస్‌ పోలీసు అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ నుంచి రుద్రంపూర్‌ కోల్డ్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌(ఆర్‌సిహెచ్‌పి)కు వెళ్లే రైల్వే మార్గంలో బేరియం తండా వద్ద  రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం ఉన్న ప్రాంతం కొత్తగూడెం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంది. ఆ బాలిక నివసించే ప్రాంతం మాత్రం కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కావడంతో బాలిక అదృశ్యమైనట్లు ఈనెల 24వ తేదీ ఉదయం 4-30నిముషాలకు కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రైల్వే ట్రాక్‌పై బాలిక మృతిచెందడంతో ఈ కేసును కొత్తగూడెం టుటౌన్‌ పోలీసులు రైల్వే జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ (భద్రాచలం రోడ్‌) జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ ఉపేందర్‌ కేసు నమోదు చేశారు. బాలిక మృతిచెందిన సంఘటనా స్థలానికి  ఆమె నివసిస్తున్న ఇంటికి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం ఉండటం, పాదాలకు నల్లటి మట్టి అంటుకున్న ఆనవాళ్లు ఉండటంతో బాలిక అంతదూరం నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా హత్యచేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుంటే శరీర మొత్తం చిద్రమయ్యేదని, కానీ బాలిక మృతదేహం రైలుపట్టాల మధ్యలో ముడుచుకొని ఉన్న స్థితిలో స్వల్ప వస్ర్తాలతో పడిఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై జిల్లా కేంద్రమైన కొత్తగూడెం స్వచ్ఛంధ సంస్థలు, మహిళా సంఘాలు, నిర్భయ ఆర్గనైజేషన్‌ సంసంస్థ, ఐద్వా సంఘాలు, బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్‌, మైనర్‌బాలిక కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేస్తూ మృతిచెందిన బాలిక ఆత్మశాంతి చేకూరాలని నివాలులు అర్పించారు.  


కుటుంబసభ్యులతో విచారణ 

మైనర్‌బాలిక మృతికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఓ ఐపీఎస్‌ అధికారి బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను కొత్తగూడెం టుటౌన్‌పోలీసుస్టేషన్‌కు పిలిపించి దర్యాప్తు చేసినట్లు సమాచారం. అసలు ఈనెల 23తేదీన బాలిక అదృశ్యం కావడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను కుటుంబా సభ్యులనుంచి సేకరించారు. అదేవిధంగా సదరు బాలిక ఇంటి వెనుక ఉన్న ఓ యువకుడు (19), అతడి తల్లిదండ్రులను కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2020-06-29T17:42:51+05:30 IST