Abn logo
May 8 2021 @ 02:43AM

రాష్ట్రంలో కొత్తగా 17,188 కేసులు..73 మంది మృతి

చిత్తూరులో 2,260 పాజిటివ్‌లు.. ఏడు జిల్లాల్లో వెయ్యిపైనే కేసులు.. 24 గంటల్లో 73 మంది మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో 1,00,424 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 17,188 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కరోనాతో 73మంది మృతిచెందినట్టు పేర్కొంది. తాజా గా చిత్తూరు జిల్లాలో 2,260 మందికి వైరస్‌ సోకగా.. విశాఖలో 1,868, తూర్పుగోదావరిలో 1,823, అనంతపురంలో 1,779, శ్రీకాకుళంలో 1,632, నెల్లూరులో 1,530, గుంటూరులో 1,515, కర్నూలులో 1,342 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 12,45,374కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24గం టల వ్యవధిలో విజయనగరం జిల్లాలో 11మంది, విశాఖలో 10, తూర్పుగోదావరిలో 8, చిత్తూరులో 7, కృష్ణాలో 6, గుంటూరులో 6, కర్నూలులో 5, ప్రకాశంలో 5, పశ్చిమగోదావరిలో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 4, అనంతపురంలో ఇద్దరు చప్పున చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 8,519కి చేరుకున్నాయి. 


భర్త మృతి, షాక్‌తో భార్య కూడా..

కరోనాతో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడ ని తెలిసి భార్యకూడా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటా సత్యారావు(75) ఆస్పత్రి లో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందగా.. ఈ వార్త తెలిసి ఇంటి వద్ద భార్య గంటా సత్యవతి(68) కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందింది. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ కడు పేదవారు కావడంతో సత్యారావుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చినవారే సత్యవతి మృతదేహాన్ని ఆదే వాహనంలో కాకినాడ తరలించి అక్కడే భార్యాభర్తలకు అంత్యక్రియలు నిర్వహించారు.  


బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ విక్రయం, నలుగురి అరెస్టు

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన షేక్‌ యూస్‌ఫఅలీ(35), ఆయన స్నేహితుడు షేక్‌ ఖలీద్‌అలీ(35).. చిత్తూరులో మెడికల్‌ రెప్రజెంటేటివ్‌ హరిప్రసాద్‌రెడ్డి నుంచి తక్కువ ధరకు ఇంజెక్షన్లు తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. మదనపల్లెలో మెడికల్‌ స్టోర్‌ ఉన్న పి.నవీన్‌కుమార్‌ కూడా హరిప్రసాద్‌రెడ్డి పంపిన ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయించి కమీషన్లు తీసుకుంటున్నాడన్నారు. గురువారం రాత్రి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడిచేసి యూస్‌ఫఅలీ, ఖలీద్‌అలీని అదుపులోకి తీసుకుని 2వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. యూస్‌ఫఅలీ, ఖలీద్‌అలీ, హరిప్రసాద్‌రెడ్డి, నవీన్‌కుమార్‌ను అరెస్టు చేశామని, హరిప్రసాద్‌కు సహకరించే చిత్తూరుకు చెందిన బాలాజీపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

దళారుల జోక్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన 


నెల్లూరు(వైద్యం) మే 7: నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో దళారుల ప్రమేయంపై కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో బెడ్‌ కోసం కరోనా బాధితుల నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ‘పైసలిస్తే పడక’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. తిక్కన ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్‌... ఇలాంటి అక్రమాలను అరికట్టాలని, అవినీతికి పాల్పడే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement