అద్వితీయుడు ఆది శంకరుడు

ABN , First Publish Date - 2021-05-14T03:43:56+05:30 IST

ఆది కవి వాల్మీకి రామాయణాన్ని రచించి, ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో లోకానికి మార్గదర్శనం చేశాడు. వ్యాస మునీంద్రుడు మహా భారతం ద్వారా భారతీయ సంస్కృతిని భావి తరాలకు అందించాడు....

అద్వితీయుడు ఆది శంకరుడు

17న శ్రీ శంకర జయంతి


ఆది కవి వాల్మీకి రామాయణాన్ని రచించి, ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో లోకానికి మార్గదర్శనం చేశాడు. వ్యాస మునీంద్రుడు మహా భారతం ద్వారా భారతీయ సంస్కృతిని భావి తరాలకు అందించాడు. ప్రస్థానత్రయం, పురాణాలు రచించాడు. శాఖోపశాఖలుగా చీలిపోయి, అస్తవ్యస్తంగా ఉన్న హిందూ మతాన్నీ, వైదిక ధర్మాన్నీ ఆదిశంకరులు పునరుద్ధరించి, ఒకే తాటిమీదకు తెచ్చి పునరుజ్జీవింపజేశారు. ఈ విధంగా వాల్మీకి, వ్యాసుల సరసన నిలువదగిన మహా పురుషుడు ఆది శంకరులు. 


ఎనిమిదేళ్ళ వయసులోనే ఆపత్సన్న్యాసం స్వీకరించి, తల్లి అనుజ్ఞతో శ్రీ శంకరులు దేశ సంచారం ప్రారంభించారు. పరివ్రాజకులై, నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదాచార్యుల దగ్గర క్రమ సన్న్యాసం స్వీకరించి శ్రీ శంకర భగవత్పాదాచార్యులుగా యోగపట్టాన్ని స్వీకరించారు. దీని ద్వారా ఎనిమిదేళ్ళ తన ఆయుస్సును పదహారేళ్ళకు శంకరులు పెంచుకోగలిగారు. గురువు ఆదేశం ప్రకారం కాశీ క్షేత్రం చేరుకున్నారు. ‘‘కర్మ లేనప్పుడు కర్మఫలం లేదు. కర్మఫలం లేకపోతే దేహం, దేహానికి సంబంధించిన దుఃఖాలూ లేవు’’ అనే మహోపదేశాన్ని ఆయన అందించారు. ఈ ఉపదేశానికి అవసరమైన ఆచరణపై ఆయనకు అవగాహనను కాశీ విశ్వనాథుడే కల్పించాడు. దాని పర్యవసానమే ఆయన ప్రవచించిన ‘మనీషా పంచకం’. శంకరులు ఈశ్వర సాక్షాత్కారంతో బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు. వ్యాసుని దర్శనం కూడా ఆయనకు లభించింది. శంకరుల జ్ఞాన సంపదకు మెచ్చిన వ్యాస మహర్షి తాను రచించిన ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలనీ, వైదిక ధర్మ పునరుజ్జీవానికీ, ప్రాచుర్యానికీ దేశం నలుమూలలా పర్యటించాలనీ ఆదేశించాడు. శంకరుల పదహారేళ్ళ ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తూ దీవించాడు.


వెలలేని సంపద

వ్యాసుడి ఆదేశాన్ని పాటిస్తూ ప్రస్థానత్రయ భాష్యాన్నీ, అద్వైత సిద్ధాంత ప్రాచుర్యానికి దోహదకారులుగా అనేక ప్రకరణ గ్రంథాలను శంకరులు రచించారు. దేశ పర్యటనలో తాను దర్శించిన అనేక ఆలయాల్లో యంత్రాలను స్థాపించారు. ఆయా దేవీ దేవతలపై ఎన్నో స్తోత్రాలు రచించారు. అవి వందల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రకరణ గ్రంథాల్లో ఎంతో తాత్త్వికతను శంకరులు పొందుపరిచారు.

‘శివేవ సదాజీవో జీవ ఏవ సదాశివః వేత్త్పైక్య మనమోర్యస్తుస ఆత్మఙో సచేతరః’


(ఆత్మానుభూతి) అని ప్రవచించారు.  ‘‘ఎల్లప్పుడూ శివుడే జీవుడే జీవుడు. జీవుడే శివుడు. వీరిద్దరి మధ్యా ఏకత్వాన్ని ఎరిగినవాడే ఆత్మజ్ఞుడు. ఇతరులు కారు’’ అని భావం.

‘అపరోక్షానుభూతి’లో ‘యత్రజ్ఞా నాద్భవేద్‌ ద్వైత మితరస్తత్ర పశ్యతి

ఆత్మత్వేన యదా సర్వం నేతరస్తత్ర చాణ్యపి’ అని స్పష్టం  చేశారు. ‘‘ఎక్కడ అజ్ఞానం కారణంగా ద్వైత భావం (‘ఇది దేహం- ఇది ఆత్మ’ అనే భేదం) ఉంటుందో అక్కడ ఇతరమైనవి కనిపిస్తాయి. సర్వం ఆత్మతత్త్వంగా భావిస్తే అక్కడ అన్యమైన విషయాలు కనిపించవ’ని దీని అంతరార్థం.


‘‘కుండలాంటి వస్తువులను దీపం ప్రకాశింపజేసినట్టే బుద్ధినీ, ఇంద్రియాలనూ ఆత్మ ప్రకాశింపజేస్తోంది. అంతేకాని కదలని వస్తువుల ద్వారా ఆత్మ ప్రకాశం కావడం లేదు కాబట్టి ఆత్మే బ్రహ్మం’’ అని ఆయన చాటి చెప్పారు.


‘దేహో దేవాలయఃప్రోక్తో జీవో దేవో సదాశివః

త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావనే పూజయేత్‌’

‘‘దేహమే దేవాలయం. జీవుడే సదాశివుడైన దైవం. ‘అజ్ఞానం’ అనే నైర్మల్యాన్ని తొలగించి, అతడు (పరమాత్మ) నేనూ ఒకటేననే భావంతో భగవంతుణ్ణి అర్చించాలి’’ అని శంకరులు మార్గదర్శనం చేశారు.


‘బ్రహ్మ సత్యం - జగత్తు మిధ్య’ అనే అద్వైత భావాన్ని అనేక ప్రకరణ గ్రంథాల ద్వారా సోదాహరణంగా వివరించిన శంకరులు ఆశువుగా చెప్పిన అనేక అష్టకాలనూ, స్తోత్రాలనూ ఆయన శిష్యులు గ్రంథస్తం చేశారు. ఎంతటి గొప్పవారైనా గురువుల పట్ల భక్తి భావనతో, ఎల్లప్పుడూ గురు చింతనతో ఉండాలన్నారు శంకరులు. ‘‘షడంగాలనూ, చతుర్వేదాలనూ, శాస్త్రవిద్యలన్నిటినీ ఆపోశన పట్టాను. కవిత్వంలో గద్య, పద్యాలను చెప్పగలను. కానీ గురువు పాదాల మీద మనసు నిలవనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమిటి?’’ అని ప్రశ్నించుకున్నారు.


‘భజగోవిందం’, ‘కనకధారాస్తోత్రం’, ‘అన్నపూర్ణాష్టకం’, ‘రాజరాజేశ్వరీ స్తోత్రం’, ‘విశ్వనాథాష్టకం’, ‘లింగాష్టకం’, దక్షిణామూర్త్యష్టకం’... ఇలా శ్రీశంకరులు అందించిన అష్టకాలు, స్తోత్రాల పరంపర అపారం. ముఖ్యంగా ‘శివానంద లహరి’, ‘సౌందర్య లహరి’ లాంటివి వెలలేని ఆధ్యాత్మిక సంపద. 


నలుదిక్కులా స్ఫూర్తి కేంద్రాలు

దేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయాలను (స్ఫూర్తి కేంద్రాలు) శంకరులు నెలకొల్పారు. పశ్చిమంలోని ద్వారకా పీఠానికి పద్మపాదుణ్ణీ, ఉత్తరాన బదరికా (బదరీనాథ్‌) పీఠానికి తోటకాచార్యుడినీ, తూర్పున పూరీలో గోవర్థన మఠానికి హస్తామలకుణ్ణీ, దక్షిణాన శృంగేరి పీఠానికి సురేశ్వరుణ్ణీ ిపీఠాధిపతులుగా నియమించారు. ఈ పనులన్నీ ఆచరించి, భూమిపై తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని... 32 ఏళ్ళ వయసులో శివసాయుజ్యాన్ని పొందారు శంకరులు. పరాయి పాలనలనూ, దాడులనూ తట్టుకొని వైదిక ధర్మం చెక్కుచేదరలేదంటే దానికి ఆయన వేసిన బలమైన పునాదే కారణం. పరిమిత కాలంలో... వేల సంవత్సరాలైనా చెరగని ముద్ర వేసిన అద్వితీయుడు శ్రీ ఆదిశంకరాచార్యులు.


ఎ. సీతారామారావు

Updated Date - 2021-05-14T03:43:56+05:30 IST