17న అమిత్‌షాతో ఎంపీల భేటీ

ABN , First Publish Date - 2022-01-12T14:04:26+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎట్టకేలకు రాష్ట్ర ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాష్ట్రంలో నీట్‌ కారణంగా విద్యార్థులు పడుతున్న అవస్థలకు సంబంధించి ఎంపీలు గోడు వెళ్లబోసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో

17న అమిత్‌షాతో ఎంపీల భేటీ

- నీట్‌ రద్దుపై చర్చ

- ఖరారైన అపాయింట్‌మెంట్‌


చెన్నై: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎట్టకేలకు రాష్ట్ర ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాష్ట్రంలో నీట్‌  కారణంగా విద్యార్థులు పడుతున్న అవస్థలకు సంబంధించి ఎంపీలు గోడు వెళ్లబోసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌ బాలు నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా ఢిల్లీలో ఈ నెల 17న అమిత్‌షాను కలువనున్నారు. ఈ విషయాన్ని టీఆర్‌ బాలు చెన్నైలో ప్రకటించారు. నీట్‌ నుంచి రాష్ర్టాన్ని మినహాయించాలని కోరుతూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో డీఎంకే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన ఎంపీలతో కలిసి డిసెంబరు 28న రాష్ట్రపతి భవన్‌లో నీట్‌ నుంచి మినహాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అమిత్‌షాను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండుమూడు సార్లు అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా అమిత్‌షా నుంచి ఎలాంటి సమాధానం రాలేదని టీఆర్‌ బాలు ఆరోపిం చారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎంపీలను కలుసుకునేందుకు అమిత్‌షా కార్యాలయం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపేలా గవర్నర్‌ను ఆదేశించాలని తామంతా అమిత్‌షాను కోరతామని టీఆర్‌ బాలు తెలిపారు. తన నాయకత్వంలో అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ ఎంపీ నవాజ్‌ఘనీ, సీపీఎం ఎంపీ వెంకటేశన్‌, కాంగ్రెస్‌ ఎంపీ కె.జయకుమార్‌, డీపీఐ ఎంపీ తిరుమావళవన్‌, ఎండీఎంకే ఎంపీ వైగో సహా పదిమంది అమిత్‌షాను కలుసుకుని వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - 2022-01-12T14:04:26+05:30 IST