ఔషధ ఎగుమతుల్లో 18% వృద్ధి

ABN , First Publish Date - 2021-04-18T05:44:58+05:30 IST

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత్‌ 2,444 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,78,412 కోట్లు) విలువైన

ఔషధ ఎగుమతుల్లో 18% వృద్ధి

 గత ఎనిమిదేళ్లలోనే గరిష్ఠం 

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,78,412 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారత్‌ 2,444 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,78,412 కోట్లు) విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 2,058 కోట్ల డాలర్లతో పోలిస్తే 18.07 శాతం పెరిగాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాగ్జిల్‌) వెల్లడించింది. గత ఎనిమిదేళ్లలోనే  ఔషధ ఎగుమతుల వృద్ధి రేటు గరిష్ఠంగా ఉందని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. భారత జనరిక్‌లకు, వ్యాక్సిన్లకు గిరాకీ పెరుగుతున్నందున భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి వృద్ధి కొనసాగగలదని భావిస్తున్నట్లు చెప్పారు.

'

2020-21లో అన్ని నెలల కంటే మార్చిలో అత్యధికంగా 230 కోట్ల డాలర్ల ఔషధాలను భారత కంపెనీలు ఎగుమతి చేశాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 48.5 శాతం పెరిగినట్లు ఫార్మాగ్జిల్‌ వెల్లడించింది. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా 154 కోట్ల డాలర్ల ఎగుమతులు మాత్రమే చేయడం వల్ల వృద్ధి రేటు అధికంగా ఉన్నట్లు వివరించింది. 2020 ఏడాది ప్రపంచ ఔషధ మార్కెట్‌ దాదాపు 2 శాతం వరకూ క్షీణించింది. అయినప్పటికీ.. భారత ఎగుమతులు పెరిగాయి. భారత డ్రగ్‌ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌కు గిరాకీ పెరిగింది. 




పీఎల్‌ఐ ఊతం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ (ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు)పథకం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని.. ఏపీఐల కోసం వివిధ దేశాలు భారత్‌పై ఆధారపడే వీలుందని ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో వ్యాక్సిన్‌ ఎగుమతులు కూడా భారీగా పెరగనున్నాయని అభిప్రాయపడ్డారు. 


ప్రధాన మార్కెట్లకు: భారత ఔషధ ఎగుమతుల్లో 34 శాతానికి పైగా వాటా ఉత్తర అమెరికాదే. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 12.6 శాతం, కెనడాకు 30 శాతం, మెక్సికోకు 21.4 శాతం చొప్పున ఔషధ ఎగుమతులు పెరిగాయి. అంతక్రితం ఏడాదిలో ఆఫ్రికాకు ఎగుమతులు 2.24 శాతం మాత్రమే పెరగ్గా.. ఈ సారి 13.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. యూరప్‌ దేశాలకు చేసిన ఎగుమతుల్లో 11% వృద్ధి నమోదైందని ఫార్మాగ్జిల్‌ తెలిపింది. ఆస్ట్రేలియా, యూఏఈ, ఉజ్బెకిస్థాన్‌, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు చేసిన ఎగుమతుల్లో వృద్ధి రేటు ఆకర్షణీయంగా 21 శాతం నుంచి 125 శాతం వరకు ఉంది.  


Updated Date - 2021-04-18T05:44:58+05:30 IST