ఇంకా తగ్గలేదు..!

ABN , First Publish Date - 2020-06-01T10:12:29+05:30 IST

జిల్లాలో కరోనా తగ్గినట్లే తగ్గిన మళ్లీ దడ పుట్టిస్తోంది. ఆదివారం ఒకే రోజు 18 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది

ఇంకా తగ్గలేదు..!

ఒకే రోజు 18 పాజిటివ్‌

మొత్తం కేసులు 721


కర్నూలు(హాస్పిటల్‌)/నంద్యాల/ఆదోని/ఆలూరు, మే 31: జిల్లాలో కరోనా తగ్గినట్లే తగ్గిన మళ్లీ దడ పుట్టిస్తోంది. ఆదివారం ఒకే రోజు 18 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. జిల్లాలో బాధితుల సంఖ్య 721కు చేరింది. తాజా కేసుల్లో కర్నూలు నగరంలో 9, ఆదోని పట్టణంలో 3, గూడూరులో  రెండు ఆదోని మండలం బసాపురం, బైచిగేరి, ఆలూరు, అరిగేరి తండాలో ఒక్కొక్కటి, ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆలూరుకు చెందిన ఓ మహిళ కొవిడ్‌తో మృతి చెందినట్లు అధికారులు వెళ్లడించారు. వలస కూలీలు రావడంతోనే పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని ఆదోని తహసీల్దారు రామకృష్ణ పేర్కొన్నారు. వారం రోజుల్లో ముంబై నుంచి మరికొందరు వలస కూలీలు ఆదోని డివిజన్‌కు వస్తారని ఆయన తెలిపారు. 


గూడూరులో తొలిసారి..

గూడూరు నగర పంచాయతీలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని ఓ యువకుడికి, ముంబై నుంచి బంధువుల అంత్యక్రియలకు వచ్చిన మరో వ్యక్తికి పాజిటివ్‌ తేలింది. వీరిని విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. 


ఆరుగురు డిశ్చార్జి

కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురు ఆదివారం డిశ్చార్జి అయ్యారు. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ఒకరు, నంద్యాల శాంతిరాం జిల్లా ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి ఐదుగురు ఇళ్లకు వెళ్లారు. వీరిలో కర్నూలు నగరవాసి ఒకరు, కోసిగి వాసులు ఇద్దరు, కౌతాళం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు పట్టణ వాసులు ఒక్కొక్కరు ఉన్నారు. జిల్లాలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 615కు చేరింది. కోలుకున్న ఒక్కొక్కరికి రూ.2 వేలు ప్రభుత్వ సాయం అందించి పంపించామని వైద్యాధికారులు తెలిపారు.


సచివాలయ ఉద్యోగులకు..

ఆలూరు మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడుకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలూరు, పెద్ద హోతూరులో ఒక్కో కేసు ఉండగా, అరికెర తండాలో ఆదివారం ఓ వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ అయిందని తహసీల్దారు హుసేన్‌సాబ్‌ తెలిపారు. ఈ ముగ్గురు బాధితులూ సచివాలయ ఉద్యోగులే కావడం గమనార్హం. అరికెర తండాను కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయిన సచివాలయ ఉద్యోగిని క్వారంటైన్‌లో ఉంచారు. అతని కాంటాక్ట్‌ లిస్టును అధికారులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-06-01T10:12:29+05:30 IST