నవాబుపేటలో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-06-04T10:15:57+05:30 IST

నవాబుపేట.. మైలవరం మండలం చిన్నకొమెర్ల మజరా గ్రామం. రెక్కాడితే తప్ప పూటగడవని కష్టజీవుల ఆవాసం. ఆ పల్లెలో కరోనా కల్లోలం

నవాబుపేటలో కరోనా కల్లోలం

ఒకేరోజు 18 మందికి పాజిటివ్‌

రాజంపేటలో ముగ్గురు, ప్రొద్దుటూరులో ఇద్దరికి..

జిల్లాలో 161కి కరోనా కేసులు

ఆందోళనలో గ్రామీణ జనం


కడప, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నవాబుపేట.. మైలవరం మండలం చిన్నకొమెర్ల మజరా గ్రామం. రెక్కాడితే తప్ప పూటగడవని కష్టజీవుల ఆవాసం. ఆ పల్లెలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐదురోజుల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆ వ్యక్తితో కలిసి ఉపాధి పనుల్లో పాల్గొన్న పలువురికి కరోనా సోకింది. బుధవారం ఒక్క రోజే అధికారికంగా పది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సాయంత్రానికి వచ్చిన ఫలితాల ప్రకారం మరో 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. అయితే.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకేరోజు ఆ పల్లెలో 18 మందికి పాజిటివ్‌ అని తేలడంతో అందరినీ కరోనా భయం వెంటాడుతోంది. 


ఒకే రోజు 23 మందికి..

జిల్లాలో ఏప్రిల్‌ 1వ తారీఖున కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వేంపల్లెలో 15 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేసులు వచ్చినా ఒకేరోజు జిల్లాలో 23 కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. మైలవరం మండలం చిన్నకొమెర్ల పంచాయతీ మజరా గ్రామం నవాబుపేటకు చెందిన 38 ఏళ ్ల వ్యక్తిని మే 28వ తేదీన క్వారంటైన్‌కు తరలించి పరీక్ష చేయగా.. 30న పాజిటివ్‌ వచ్చింది. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ పరీక్షించగా రెండురోజుల క్రితం ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో ప్రైమరీ కాంటాక్ట్సు, ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు 191 మందిని శాంపిల్స్‌ తీసి కరోనా టెస్టులు చేస్తే బుధవారం ఉదయానికి పది మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 8 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినా ఐపీఎంఆర్‌ నిబంధనల ప్రకారం అధికారికంగా ప్రకటించాల్సి ఉందని జిల్లా వైద్య అధికారులు పేర్కొంటున్నారు.


కరోనా బాధితులను కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ కోవిడ్‌-19 జిల్లా ఆసుపత్రికి తరలించారు. భారీగా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామంలో 300 మందికి స్వాబ్‌ శాంపిల్స్‌ తీసి పరీక్షలు చేస్తున్నారు. కాగా కరోనా వచ్చిన వారిలో ఇద్దరు స్థానిక సిమెంటు పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. నవాబుపేటలో సీఐ మంజునాధరెడ్డి, తలమంచిపట్నం, మైలవరం ఎస్‌ఐలు ధనుంజయుడు, ప్రవీణ్‌కుమార్‌లు పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.


ప్రొద్దుటూరులో ఇద్దరు.. రాజంపేటలో ముగ్గురికి...

ప్రొద్దుటూరులో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీటితో కలిపితే పాజిటివ్‌ బాధితుల సంఖ్య 48కి చేరింది. గ్రీన్‌జోన్‌గా ఉన్న రాజంపేటలో తొలిసారిగా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆ పట్టణంలో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కువైత్‌ నుంచి జిల్లాకు వచ్చిన భార్యాభర్తలిద్దరూ అద్దె క్వారంటైన్‌లో ఉంటున్నారు. వారిద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అదే పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమె విఽధి నిర్వహణలో భాగంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.


వైరస్‌ ఎలా వ్యాపించింది..?

నవాబుపేటలో కలకలం రేపిన కరోనా వైరస్‌ ఎలా వ్యాపించింది..? అధికారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఆ గ్రామ సమీపంలోనే సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. సిమెంటు రవాణా కోసం వివిధ ప్రాంతాల నుంచి లారీలు వస్తున్నాయి. లారీ డ్రైవర్ల ద్వారా వ్యాపించిందా..? తొలి పాజిటివ్‌ బాధితుడు స్థానిక సిమెంటు పరిశ్రమలోనే కాక ఎర్రగుంట్ల, తాడిపత్రి ప్రాంతాల్లోని పాత భవనాల శ్లాబులు కూల్చే పనికి వెళ్లాడని, అక్కడ ఈ వైరస్‌ సోకిందా అనేది తేలడం లేదు. అంతేకాకుండా అతను గ్రామంలో ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లాడు. కాగా బుధవారం పాజిటివ్‌ వచ్చిన పది మందిలో ఓ మహిళ స్వీపరుగా, మరో వ్యక్తి మైనింగ్‌లో పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పరిశ్రమ ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన మొదలైంది. మైలవరంలోని ముగ్గురు పాజిటివ్‌ బాఽధితుల ఇంటికి కర్నూలు నుంచి బంధువులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


స్వీయ రక్షణే మందు :కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ, కడప

నవాబుపేటలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వైరస్‌ ఎలా వచ్చిందో పరిశీలిస్తున్నాం. సిమెంటు పరిశ్రమ పరిసర గ్రామాల్లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాం. 200, 400 మీటర్లలో కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించి లాక్‌డౌన్‌ నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నాం.


ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు: ఉమాసుందరి, డీఎం అండ్‌ హెచ్‌వో

నవాబుపేటతో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే 191 మందికి పరీక్షలు నిర్వహించాం. బుధవారం ఒక్కరోజే 300 శాంపిల్స్‌ సేకరించాం. నేటి నుంచి సమీప గ్రామాల్లో కూడా పరీక్షలు విస్తృతం చేస్తాం. అనుమానం ఉన్న వాళ్లు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలకు సహకరించాలి.

Updated Date - 2020-06-04T10:15:57+05:30 IST